నేటి నుంచి టీఎస్ క్లాస్ ప్రసారాలు
ప్రారంభించనున్న మంత్రులు కడియం, కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ‘టీఎస్–క్లాస్’ కార్యక్రమాలు బుధవారం నుంచి మనటీవీలో ప్రసారం కానున్నాయి. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ఈ ప్రసారాలను ప్రారంభించనున్నారు. ప్రతిరోజు ఉదయం 10.30 నుంచి 12.55 వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలు విద్యార్థులకు వరమని మనటీవీ సీఈవో శైలేష్‌రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాష్ట్రంలోని 6 వేల ప్రభుత్వ పాఠశాలలకు ఈ ప్రసార కార్యక్రమాలు అందనున్నాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక సాంకేతికతతో అందించే విద్యను పటిష్టపర్చాలనే లక్ష్యానికి ఇదో ముందడుగు అని, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా డిజిటల్ విద్య అందనుందని తెలిపారు.