TS I-Pass
-
రండి.. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టండి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వివిధ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. పరిశ్రమల ఏర్పాటుకున్న అవకాశాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించాలని కోరారు. దుబాయ్‌లో జరుగుతున్న గల్ఫుడ్ – 2018 ట్రేడ్‌షోలో మంత్రి పాల్గొన్నారు. రెండోరోజు బుధవారం ట్రేడ్‌షోలో పాల్గొన్న వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఇప్పటికే అనేక సంస్థలు తమ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సింగిల్‌విండో విధానంలో ఇచ్చేందుకు టీఎస్ ఐపాస్ అమలు చేస్తున్నామని తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరా, నీటి లభ్యత, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అనేక రాయితీలను కూడా కల్పిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మాంసం ఉత్పత్తి రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు వచ్చే నెలలో మన రాష్ట్రంలో పర్యటించేందుకు వివిధ సంస్థల ప్రతినిధులు అంగీకారం తెలిపారని మంత్రి వెల్లడించారు. మాంసాన్ని దిగుమతి చేసుకుంటున్న రాష్ట్రం మాంసం ఎగుమతి చేసేస్థాయికి ఎదగాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే 5 వేల కోట్ల రూపాయల ఖర్చుతో గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేశామని, వీటి ద్వారా రాబోయే రోజుల్లో మాంసం ఎగుమతి చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. చేపల పెంపకాన్ని మరింత ప్రోత్సహించి మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు గత సంవత్సరం 22 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేశామని వివరించారు. ట్రేడ్‌షోలో మంత్రితోపాటు డెయిరీ డెవలప్మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ నిర్మల, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. -
మూడు నిమిషాల్లో ముగిసిన కేసీఆర్ ప్రసంగం
సాక్షి, హైదరాబాద్ : టీఎస్- ఐపాస్ (నూతన పారిశ్రామిక విధానం)తో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. నగరంలోని హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో ఆయన మంగళవారం ప్రసంగించారు. జీఈఎస్ సదస్సుకు హైదరాబాద్ వేదిక కావడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. టీఎస్-ఐపాస్ ద్వారా ఇప్పటివరకూ 5,469 యూనిట్లకు అనుమతి ఇచ్చామని తెలిపారు. ‘ఈజ్ ఆఫ్ డుయింగ్ బిజినెస్’లో తెలంగాణకు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్నారు. తెలంగాణ పారిశ్రామికంగా పుంజుకుంటోందని, టీ హబ్ ద్వారా ఔత్సాహికులను ప్రోత్సహిస్తున్నామని ఆయన తెలిపారు. పెట్టుబడులకు హైదరాబాద్ అన్నిరకాల అనుకూలమైన ప్రాంతం అని అన్నారు. అమెరికాలో అయిదు ముఖ్యమైన కంపెనీల బ్రాంచ్‌లు హైదరాబాద్‌లో ఉన్నాయని కేసీఆర్ తెలిపారు. జీఈఎస్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం మూడు నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు. -
జీఈఎస్ వేదిక పై సీఎం కేసీఆర్ ప్రసంగం
-
పారదర్శకతతో అనుమతులివ్వాలి
‘టీఎస్ ఐ-పాస్’పై కలెక్టర్ సూచనలు సంగారెడ్డి జోన్: తెలంగాణ రాష్ట్ర ఐ-పాస్ మార్గదర్శకాలను తప్పక పాటిస్తూ, పరిశ్రమల స్థాపనకు పారదర్శకతతో అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ సూచించారు. బుధవారం కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, అనుబంధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా రోనాల్డ్‌రోస్ మాట్లాడుతూ.. ఔత్సాహికుల దరఖాస్తులను 15 రోజుల్లోగా పరిశీలించి, ఆన్లైన్ ద్వారా అనుమతులు జారీ చేయాలని ఆదేశించారు. ఆక్షేపణలు, అసంపూర్తి సమాచారం ఉన్నప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా నేరుగా తిరస్కరణకు గల కారణాలను లబ్ధిదారులకు తెలియజేయాలన్నారు. భూగర్భ జలవనరుల శాఖ, ట్రాన్స్ కో-ఫ్యాక్టరీల ఇన్స్పెక్టర్, కాలుష్య నియంత్రణ మండలి, హెచ్ఎండీఏ తదితర శాఖలు ఔత్సాహికులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. టీఎస్ ఐ-పాస్ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ కార్యదర్శులే నేరుగా దరఖాస్తుదారులకు ఎన్ఓసీ జారీ చేయడం సమంజసం కాదని, జిల్లా పంచాయతీ అధికారి ఈ విషయంలో తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ సురేశ్‌కుమార్, అనుబంధ శాఖల అధికారులు, పరిశ్రమ ప్రోత్సాహక అధికారులు పాల్గొన్నారు. వివిధ శాఖలతో సమీక్ష సంగారెడ్డి జోన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ రోనాల్డ్‌రోస్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వైద్య, ఆరోగ్య, మున్సిపల్ కమిషనర్లతో పాటు అనుబంధ శాఖల అధికారులతో వర్షాకాలంలో మలేరియా, డెంగీ, చికెన్‌గున్యా, ఫైలేరియా, జపానీస్ ఎన్సెఫాలిటీస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు తమ ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న నినాదాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లాలన్నారు. ప్రతి గ్రామం, పట్టణాల్లో ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులను, డ్రెయిన్లను సమయానికి శుభ్రం చేయాలని సూచించారు. సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో పెద్ద ఎత్తున కరపత్రాలు పంచాలని ఆదేశించారు. రెండు నెలల విరామం తర్వాత విద్యార్థులంతా పాఠశాలలకు వచ్చినందున వారి ఆరోగ్యాలను పరీక్షించాలని వైద్య, ఆరోగ్య శాఖాధికారిని సూచించారు. కేజీబీవీ, గురుకుల పాఠశాలల్లో తక్షణమే యాంటీ మలేరియా మందులు స్ప్రే చేయాలన్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి అమర్‌సింగ్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, ఫ్లూయిడ్లు, మందులు అందుబాటులో ఉంచామన్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ చక్రవర్తి మాట్లాడుతూ.. గ్రామాల్లో వాటర్ ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ రమణాచారి మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులను ఇప్పటికే తగ్గించామన్నారు. సమావేశంలో విద్యా, ఐసీడీఎస్, ఆర్‌డబ్ల్యుఎస్, గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.