
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని పశుసంవర్ధక మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వివిధ సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. పరిశ్రమల ఏర్పాటుకున్న అవకాశాలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు వచ్చే నెలలో తెలంగాణలో పర్యటించాలని కోరారు. దుబాయ్‌లో జరుగుతున్న గల్‌ఫుడ్ – 2018 ట్రేడ్‌షోలో మంత్రి పాల్గొన్నారు. రెండోరోజు బుధవారం ట్రేడ్‌షోలో పాల్గొన్న వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చించారు. ఇప్పటికే అనేక సంస్థలు తమ రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అనుమతులను సింగిల్‌విండో విధానంలో ఇచ్చేందుకు టీఎస్ ఐపాస్ అమలు చేస్తున్నామని తెలిపారు. 24 గంటల విద్యుత్ సరఫరా, నీటి లభ్యత, మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వం అనేక రాయితీలను కూడా కల్పిస్తోందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మాంసం ఉత్పత్తి రంగాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను పరిశీలించేందుకు వచ్చే నెలలో మన రాష్ట్రంలో పర్యటించేందుకు వివిధ సంస్థల ప్రతినిధులు అంగీకారం తెలిపారని మంత్రి వెల్లడించారు. మాంసాన్ని దిగుమతి చేసుకుంటున్న రాష్ట్రం మాంసం ఎగుమతి చేసేస్థాయికి ఎదగాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమని చెప్పారు. ఇప్పటికే 5 వేల కోట్ల రూపాయల ఖర్చుతో గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేశామని, వీటి ద్వారా రాబోయే రోజుల్లో మాంసం ఎగుమతి చేయాలనేది ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. చేపల పెంపకాన్ని మరింత ప్రోత్సహించి మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక పరిపుష్టి కల్పించేందుకు గత సంవత్సరం 22 కోట్ల చేపపిల్లలను పంపిణీ చేశామని వివరించారు. ట్రేడ్‌షోలో మంత్రితోపాటు డెయిరీ డెవలప్‌మెంట్ మేనేజింగ్ డైరెక్టర్ నిర్మల, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెలు, మేకల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment