ప్రత్యామ్నాయ చికిత్సలపై దృష్టి పెట్టాలి
ప్రివెంటివ్ మెడిసిన్‌పై అవగాహన పెంచాలి
ఫిజీషియన్స్ సదస్సులో మంత్రి సి.లక్ష్మారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చేందుకు ప్రత్యామ్నాయ చికిత్స విధానంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వైద్య, ఆరోగ్య మంత్రి సి.లక్ష్మారెడ్డి అన్నారు. అసోసియేషన్ ఆఫ్ ఫిజీషియన్స్ ఆధ్వ ర్యంలో రెండు రోజులపాటు జరుగుతున్న టీఎస్ అపికాన్ (టీఎస్‌ఏపీఐసీవోఎన్)–2017 సదస్సులో మంత్రి ప్రసంగించారు. భారతీయ సంస్కృతి, సంప్ర దాయాలలో భాగంగా అనేక వైద్య చికిత్స విధానాలు పరంపరగా వస్తున్నాయని అన్నారు. వాటిలో దేనికదే ప్రత్యేకత సంతరించుకున్నాయని చెప్పారు.
అన్నీ గొప్ప వైద్య విధానాలే అయినప్పటికీ, ఏ ఒక్క వైద్య విధానమో ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం చేకూర్చలేకపోతోందని అన్నారు. ఈ నేపథ్యంలో వైద్యులు ప్రత్యామ్నాయ విధానాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రపంచం మొత్తం యోగాపై దృష్టి సారించిందని, మానసిక ధృఢత్వానికి, రోగ నిరోధక శక్తిని పెంచడం వంటి పలు అంశాల్లో యోగా బాగా పని చేస్తున్నదని వైద్యులే చెబుతున్నారని అన్నారు. వైద్యులు బాధ్యతగా పనిచేసి, మెరుగైన వైద్య సేవలు అందించి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలని మంత్రి లక్ష్మారెడ్డి కోరారు. ఇండియన్ ఫిజీషియన్స్ అసోసి యేషన్ ప్రతినిధులు నర్సింహులు, బి.ఆర్.బన్సోడ్, విజయమోహన్, శంకర్ కంపా, మనోహర్, రాజారావు తదితరులు పాల్గొన్నారు.