కేసీఆర్ మోదీ ఏజెంట్
హైదరాబాద్ : దేశంలో పెద్ద నోట్ల రద్దు వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏజెంట్ లా వ్యవహరిస్తున్నారని సీఎల్పీ నాయకుడు టి. జీవన్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం శాసనసభ మరుసటి రోజుకు వాయిదా పడిన తర్వాత జీవన్ రెడ్డి మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, అసెంబ్లీలో మాట్లాడిన తీరు గమనిస్తే కేసీఆర్ ప్రజలకు ఏజెంటుగా కాకుండా మోదీ ఏజెంట్ గా మాట్లాడారని దుయ్యబట్టారు.
ప్రధానమంత్రి మోదీని కలిసిన తర్వాత కేసీఆర్ వైఖరి మారిందని, వారి మధ్య జరిగిన చర్చల ఆంతర్యమేంటో తెలియాలన్నారు. ప్రధాని ఏమైనా దేవుడా? ఆయన నిర్ణయాలు తప్పుపట్టరాదా? బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కేసీఆర్ ప్రజలను బలిపెడుతున్నారని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడేందుకే పెద్ద నోట్ల రద్దు అంశాన్ని చర్చకు పెట్టినట్టుందని, కనీస ఖర్చుల కోసం డబ్బులు లేక ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూలలో నిలబడి చనిపోయిన వారికి సభలో కనీసం నివాళులు అర్పించాలన్న మా పార్టీ సూచనను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు.
నగదు రహితం లావాదేవీల రాష్ట్రంగా మారుస్తామంటున్న కేసీఆర్ కు ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. వీరి నిర్వాకం వల్ల రాష్ట్రంలో 10 శాతం జనాభా బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూల్లో నిలబడాల్సిన దుస్థితి తలెత్తిందని విమర్శించారు.