కౌన్సెలింగ్ భయం
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అందని స్కాలర్షిప్పులు
ఫీజులు జమ కాలేదన్న సాకుతో టీసీలివ్వని కళాశాలలు
తిరుపతి టీటీడీ కళాశాలల్లో ఈ ఏడాది డిగ్రీ పాసైన వందలాదిమంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు గురువారం నుంచి మొదలయ్యే పీజీసెట్ కౌన్సెలింగ్కు హాజరయ్యేందుకు వెనుకంజ వేస్తున్నారు. డిగ్రీ చదువుకున్న కళాశాలల యాజమాన్యం ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు (టీసీలు) ఇవ్వని కారణంగా కౌన్సెలింగ్కు వెళ్లడం కష్టమని తలలు పట్టుకుంటున్నారు. ఒకవైపు ప్రభుత్వ నిర్లక్ష్యాన్నీ నిందిస్తూ, మరోైవైపు టీటీడీ కళాశాలలను పర్యవేక్షిస్తున్న అధికారుల ఉదాసీన వైఖరిపై భగ్గుమంటున్నారు.
తిరుపతి: తిరుపతిలోని టీటీడీ విద్యాసంస్థల్లో డిగ్రీ పూర్తి చేసిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు పీజీ కోర్సుల్లో ప్రవేశానికి టీసీల సమస్య ఎదురవుతోంది. తిరుపతిలోని ఎస్వీ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్జీఎస్, ఎస్వీ ఆర్ట్స్ డిగ్రీ కాలేజీల్లో 2015-16 విద్యా సంవత్సరంలో 1,600 మందికి పైగా ఆఖరి సంవత్సరం పరీక్షలు రాశారు. వీరిలో చిత్తూరు, కర్నూలు, కడప, అనంతపురం, నెల్లూరు జిల్లాలకు చెందిన సుమారు 1,200 మంది ఎస్సీఎస్టీ విద్యార్థులు కూడా ఉన్నారు. ప్రభుత్వం వీరికి ఏడాదికి ఇంత అని ఉపకార వేతనాలను మంజూరు చేస్తుంటుంది. అయితే ఈ ఏడాది వీరికి ఉపకార వేతనాలు మంజూరు చేసిన ప్రభుత్వం నిధులను మాత్రం విడుదల చేయలేదు. దీంతో విద్యార్థులకు మంజూరైన ఉపకారవేతనాలు కాలేజీ ఫీజుల కింద కాలేదు. ఫీజులు పూర్తిగా చెల్లిస్తేనే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు ఇస్తామని కళాశాలల సిబ్బంది తెగేసి చెబుతున్నారు. ఎస్పీడబ్ల్యూ కళాశాల విద్యార్థినులు అధిక మొత్తంలో టీసీలు అందక అవస్థలు పడుతున్నారు. ప్రిన్సిపల్ జ్ఞానకుమారి ఫీజుల విషయంలో పట్టుదలతో ఉండటం వల్ల విద్యార్థులకు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.
కౌన్సెలింగ్కు టీసీ తప్పనిసరి
పీజీసెట్ కౌన్సెలింగ్ ద్వారా ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకామ్ కోర్సులతో పాటు ఇతరత్రా పీజీ కోర్సుల్లో చేరగోరు విద్యార్థులకు మార్కుల లిస్టుతో పాటు టీసీ కూడా కౌన్సెలింగ్ సిబ్బందికి అందజేయాలి. ఒకవేళ టీసీ లేకపోతే కోరుకున్న కోర్సులో అడ్మిషన్ కష్టమవుతుంది. దీంతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు డిగ్రీ టీసీ ల కోసం కాలేజీల చుట్టూ తిరుగుతున్నారు. బుధవారం ఒక్కరోజే 200 మం దికి పైగా విద్యార్థులు ఎస్పీడబ్ల్యు కళాశాలకు చేరుకుని టీసీలివ్వమని కోరా రు. ఇప్పటివరకూ ప్రభుత్వం స్కాలర్షిప్పులను విడుదల చేయకపోవడాన్ని జీర్ణించుకోలేని పలువురు విద్యార్థులు సర్కారు వైఖరిని నిందిస్తున్నారు.