TTL
-
అంధ క్రికెటర్‌కు ఆర్థిక సహాయం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల ప్రపంచకప్ టైటిల్ నెగ్గిన భారత అంధుల క్రికెట్ జట్టులో సభ్యుడైన మహేందర్ వైష్ణవ్‌కు టీటీఎల్ జట్ల యజమానులు రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. ఉప్పల్‌లో టీటీఎల్ ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో మహేందర్‌కు ఈ చెక్‌ను రంగారెడ్డి రైజర్స్ జట్టు యజమాని చాముండేశ్వరీనాథ్ అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు పాల్గొన్నారు. చాముండేశ్వరీనాథ్ క్రీడాకారులను ప్రోత్సహించడం ఇదేం తొలిసారి కాదు. అంతకుముందు 1972 నుంచి పారా ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులకు తలా 15 లక్షల చొప్పున మొత్తం రూ. 1.75 కోట్లను అందించాడు. ఇందుకోసం చాముండి, భారత దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ చెరో 50 లక్షలు ఇవ్వగా... మిగతా 75 లక్షలను ఇతరుల నుంచి సేకరించారు. తాజాగా ప్రపంచకప్ జిమ్నాస్టిక్స్‌లో కాంస్యం సాధించిన బుద్ధా అరుణరెడ్డికి శిక్షణ కోసం రూ.6.5 లక్షలు ప్రోత్సాహకాన్ని అందజేశారు. -
చాంపియన్ ఆదిలాబాద్ టైగర్స్
సాక్షి, హైదరాబాద్: జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 క్రికెట్ లీగ్‌లో ఆదిలాబాద్ టైగర్స్ జట్టు తొలి చాంపియన్‌గా అవతరించింది. ఆద్యంతం ఆసక్తి రేకెత్తించిన ఫైనల్లో ఆదిలాబాద్ 9 పరుగుల తేడాతో మెదక్ మావెరిక్స్ జట్టుపై గెలుపొందింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మెదక్ జట్టు చివరి వరకు పోరాడి ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు సాధించింది. టి. రవితేజ (33; 4 ఫోర్లు), బెంజమిన్ (36; 2 ఫోర్లు) రాణించారు. చివర్లో సి. హితేశ్ యాదవ్ (18 బంతుల్లో 34; 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో ఆదిలాబాద్ సాధారణ స్కోరును సాధించగలిగింది. మెదక్ బౌలర్లలో మికిల్ జైస్వాల్ (3/31), బి. సందీప్ (2/20) ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన మెదక్ మావెరిక్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించిన మావెరిక్స్ చివరి వరకు ఆ జోరును కొనసాగించలేకపోయింది. 15 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులతో పటిష్టంగా ఉన్న మెదక్ చివరి ఐదు ఓవర్లలో తడబడింది. 30 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన దశలో ఆదిలాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగులివ్వకుండా మావెరిక్స్పై ఒత్తిడి పెంచారు. దీంతో చివరి ఓవర్లో విజయానికి 21 పరుగులు చేయాల్సి ఉండగా 11 పరుగులే చేసి ఓటమి పాలైంది. మల్లికార్జున్ (38; 6 ఫోర్లు), మికిల్ జైస్వాల్ (39; 2 ఫోర్లు, 1 సిక్స్) పరవాలేదనిపించారు. హితేశ్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు సందడి చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ విజేతకు ట్రోఫీని అందజేశారు. -
హైదరాబాద్ థండర్‌బోల్ట్స్‌కు మూడో స్థానం
సాక్షి, హైదరాబాద్: జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 లీగ్‌ను హైదరాబాద్ శ్రీనిధియాన్ థండర్‌బోల్ట్స్ జట్టు సంతృప్తిగా ముగించింది. జింఖానా మైదానంలో ఆదివారం రంగారెడ్డి రైజర్స్‌తో ఉత్కంఠభరితంగా సాగిన వర్గీకరణ మ్యాచ్‌లో థండర్‌బోల్ట్స్ కేవలం ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. ఈ లీగ్‌లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. బౌలర్ రవికిరణ్ (3/30) అద్భుతమైన స్పెల్‌తో హైదరాబాద్‌కు విజయాన్నందించాడు. తొలుత బ్యాటింగ్‌లో డానీ ప్రిన్స్ (55 బంతుల్లో 104; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. విఠల్ అనురాగ్ (39 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడాడు. అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన రంగారెడ్డి 20 ఓవర్లలో 6 వికెట్లకు 193 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఓపెనర్లు ప్రతీక్ పవార్ (38 బంతుల్లో 69; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), అఖిల్ అక్కినేని (39 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలతో చెలరేగారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 115 పరుగుల్ని జోడించారు. విజయానికి చివరి ఓవర్లో రంగారెడ్డి జట్టు 8 పరుగులు చేయాల్సి ఉండగా... రవికిరణ్ వేసిన తొలి బంతికి మెహదీ హసన్ సిక్స్ బాదడంతో రంగారెడ్డి విజయం ఖాయంగానే అనిపించింది. అయితే వెంటనే రవికిరణ్ రెండు వికెట్లు పడగొట్టడంతో పాటు మూడు డాట్ బాల్స్ వేయడంతో రంగారెడ్డికి ఓటమి తప్పలేదు. సెంచరీతో కదం తొక్కిన డానీ ప్రిన్స్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
సెమీస్‌లో హైదరాబాద్ థండర్‌బోల్ట్స్
సాక్షి, హైదరాబాద్: జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 క్రికెట్ లీగ్‌లో హైదరాబాద్ థండర్‌బోల్ట్స్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. జింఖానా మైదానంలో గురువారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో హైదరాబాద్ 34 పరుగుల తేడాతో ఎంఎల్ఆర్ రాయల్స్ మహబూబ్‌నగర్‌పై ఘన విజయాన్ని సాధించింది. ఇది హైదరాబాద్‌కు వరుసగా ఎనిమిదో విజయం. లీగ్ దశలో తొమ్మిది మ్యాచ్‌లాడిన థండర్‌బోల్ట్స్ 16 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. 14 పాయింట్లతో రంగారెడ్డి రైజర్స్ రెండో స్థానానికి చేరగా... 12 పాయింట్లు సాధించిన ఆదిలాబాద్ టైగర్స్, మెదక్ మావెరిక్స్ జట్లు వరుసగా మూడు, నాలుగు స్థానాలను దక్కించుకుని సెమీస్‌లో అడుగుపెట్టాయి. ఈ మ్యాచ్‌లో బ్యాట్స్‌మన్ చందన్ సహాని (43 బంతుల్లో 74; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 169 పరుగులు చేసింది. ప్రిన్స్ (35; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. అనంతరం మహబూబ్‌నగర్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 135 పరుగులు మాత్రమే చేసి పరాజయం పాలైంది. కార్తీక్ ఆనంద్ (42; 4 ఫోర్లు, 1 సిక్స్) పోరాడాడు. హైదరాబాద్ బౌలర్లలో జయరామ్ రెడ్డి, పుష్కర్ చెరో 2 వికెట్లు తీశారు. చందన్ సహానికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం లభించింది. ఇతర మ్యాచ్‌ల వివరాలు ఆదిలాబాద్ టైగర్స్: 133/8 (మీర్ జావిద్ అలీ 52; త్రిషాంక్ గుప్తా 3/17), ఖమ్మం టిరా: 72 (ముకేశ్ 25; రవితేజ 2/19, హితేశ్ యాదవ్ 3/7). మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: మీర్ జావిద్ అలీ. నిజామాబాద్ నైట్స్: 161/9 (అనురాగ్ హరిదాస్ 57; శ్రీకరణ్ 3/28), కరీంనగర్ వారియర్స్: 116 (అశ్విని బాబు 35; అనురాగ్ హరిదాస్ 3/22). నల్లగొండ లయన్స్: 157/6 (క్రితిక్ రెడ్డి 51, తేజోధర్ 36), కాకతీయ కింగ్స్: 109 (భానుప్రకాశ్ 32; తేజోధర్ 3/19). మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్: క్రితిక్ రెడ్డి. -
ఎదురులేని హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 క్రికెట్ లీగ్‌లో హైదరాబాద్ థండర్‌బోల్ట్స్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతోంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ మైదానంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 17 పరుగుల తేడాతో రంగారెడ్డి రైజర్స్పై విజయం సాధించింది. ఇది హైదరాబాద్‌కు వరుసగా ఆరో విజయం. టోర్నీలో 7 మ్యాచ్‌లాడిన థండర్‌బోల్ట్స్ జట్టు 12 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. బ్యాటింగ్‌లో చందన్ సహాని (49 బంతుల్లో 84; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), కేఎస్కే చైతన్య (41 బంతుల్లో 63; 9 ఫోర్లు, ఒక సిక్స్) ధాటిగా ఆడటంతో మొదట బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 190 పరుగులు సాధించింది. అనంతరం రంగారెడ్డి జట్టు 20 ఓవర్లలో 6 వికెట్లకు 173 పరుగులు మాత్రమే చేయగలిగింది. ప్రతీక్ పవార్ (53 బంతుల్లో 85; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. హైదరాబాద్ బౌలర్లలో విఠల్ అనురాగ్, జయరావ్ రెడ్డి చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. ఇతర మ్యాచ్‌ల వివరాలు కరీంనగర్ వారియర్స్: 188/2 (బుద్ధి రాహుల్ 71 నాటౌట్, అశ్విన్ బాబు 57 నాటౌట్), కాకతీయ కింగ్స్: 133/5 (ప్రజ్ఞయ్ రెడ్డి 48 నాటౌట్; ఆకాశ్ రావు 2/26, విద్యానంద రెడ్డి 2/17). ఎంఎల్ఆర్ రాయల్స్ మహబూబ్‌నగర్: 104 (జె. మహేశ్ బాబు 39, ప్రణీత్ రాజ్ 5/16), మెదక్ మావెరిక్స్: 108/2 (అభిరత్ రెడ్డి 65). -
మెరిసిన తనయ్, ప్రణీత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 (టీటీఎల్) లీగ్‌లో నిజామాబాద్ నైట్స్ జట్టు బోణీ చేసింది. బ్యాట్స్‌మన్ తనయ్ త్యాగరాజన్ (38 బంతుల్లో 68; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడైన అర్ధసెంచరీతోపాటు, చివర్లో పి. ప్రణీత్ రెడ్డి (11 బంతుల్లో 32; 1 ఫోర్, 4 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో జట్టు తొలి విజయాన్ని అందుకుంది. ఎంఎల్ఆర్ గ్రౌండ్స్‌లో సోమవారం శ్రీనిధియాన్ థండర్ బోల్ట్స్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో నిజామాబాద్ నైట్స్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన శ్రీనిధియాన్ థండర్ బోల్ట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. డానీ ప్రిన్స్ (56 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), విఠల్ అనురాగ్ (43 బంతుల్లో 73; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) ధాటిగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 133 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పా రు. అనంతరం నిజామాబాద్ నైట్స్ 19.3 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి గెలుపొందింది. తనయ్, సూరజ్(23) తొలి వికెట్‌కు 89 పరుగుల్ని జోడించారు. అనురాగ్ హరిదాస్ (26; 3 ఫోర్లు) రాణించాడు. ప్రత్యర్థి బౌలర్లలో ఫహాద్, సన్నీ, అనిరుధ్, ప్రిన్స్ తలా వికెట్ తీశారు. ప్రణీత్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. నల్లగొండ లయన్స్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో ఖమ్మం టిరా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన నల్లగొండ లయన్స్ జట్టు 19.5 ఓవర్లలో 156 పరుగులకు ఆలౌటైంది. ఆశిష్ రెడ్డి (41 బంతుల్లో 56; 7 ఫోర్లు, 1 సిక్స్), హబీబ్ అహ్మద్ (30 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఖమ్మం టిరా జట్టు జునైద్ అలీ (41 బంతుల్లో 51 నాటౌట్; 7 ఫోర్లు), అస్కారి (40 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధసెంచరీలతో చెలరేగడంతో 18 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సాయి కుమార్ (26 బంతుల్లో 42; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దూకుడు ప్రదర్శించాడు.