సాక్షి, హైదరాబాద్: జి. వెంకటస్వామి స్మారక తెలంగాణ టి20 క్రికెట్ లీగ్‌లో ఆదిలాబాద్ టైగర్స్ జట్టు తొలి చాంపియన్‌గా అవతరించింది. ఆద్యంతం ఆసక్తి రేకెత్తించిన ఫైనల్లో ఆదిలాబాద్ 9 పరుగుల తేడాతో మెదక్ మావెరిక్స్ జట్టుపై గెలుపొందింది. హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మెదక్ జట్టు చివరి వరకు పోరాడి ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆదిలాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 148 పరుగులు సాధించింది.
టి. రవితేజ (33; 4 ఫోర్లు), బెంజమిన్ (36; 2 ఫోర్లు) రాణించారు. చివర్లో సి. హితేశ్ యాదవ్ (18 బంతుల్లో 34; 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడటంతో ఆదిలాబాద్ సాధారణ స్కోరును సాధించగలిగింది. మెదక్ బౌలర్లలో మికిల్ జైస్వాల్ (3/31), బి. సందీప్ (2/20) ఆకట్టుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన మెదక్ మావెరిక్స్ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 139 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. ఇన్నింగ్స్‌ను ధాటిగా ప్రారంభించిన మావెరిక్స్ చివరి వరకు ఆ జోరును కొనసాగించలేకపోయింది.
15 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్లు కోల్పోయి 105 పరుగులతో పటిష్టంగా ఉన్న మెదక్ చివరి ఐదు ఓవర్లలో తడబడింది. 30 బంతుల్లో 44 పరుగులు చేయాల్సిన దశలో ఆదిలాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పరుగులివ్వకుండా మావెరిక్స్‌పై ఒత్తిడి పెంచారు. దీంతో చివరి ఓవర్‌లో విజయానికి 21 పరుగులు చేయాల్సి ఉండగా 11 పరుగులే చేసి ఓటమి పాలైంది. మల్లికార్జున్ (38; 6 ఫోర్లు), మికిల్ జైస్వాల్ (39; 2 ఫోర్లు, 1 సిక్స్) పరవాలేదనిపించారు. హితేశ్ యాదవ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఫైనల్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో భారత బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు సందడి చేసింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హెచ్‌సీఏ అధ్యక్షుడు వివేక్ విజేతకు ట్రోఫీని అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment