మగతనం తగ్గుతుందన్న అపోహ
రాజాం:కుటుంబ రథానికి భార్యాభర్తలిద్దరూ రెండు చక్రాల్లాంటివారు. రెండూ సమానంగా నడిస్తేనే రథం సజావుగా సాగుతుంది. కష్టసుఖాలు, బాధ్యతల బరువుల్లోనూ సమాన వాటా పొందాల్సి ఉంది. కానీ కుటుంబ పెద్దలుగా ఉంటున్న మగరాయుళ్లు కుటుంబ నియంత్రణలో మాత్రం తమ బాధ్యతను పూర్తిగా విస్మరిస్తున్నారు. కుటుంబ సంక్షేమ శస్త్ర చికిత్సలకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. దాన్ని పూర్తిగా మహిళల నెత్తిన రుద్దుతున్నారు. మహిళలు కూడా ఈ విషయంలో మగాళ్లను వెనకేసుకు వస్తుండటం మరీ విడ్డూరం.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను మహిళలు(ట్యూబెక్టమీ), పురుషులు(వేసక్టమీ) కూడా చేసుకోవచ్చు. అయితే ఈ విషయంలో పురుషులు పూర్తిగా వెనుకబడ్డారు. గత ఏడాది జిల్లాలోని 75 పీహెచ్సీల పరిధిలో 18,600 కు.ని. ఆపరేషన్లు నిర్వహించగా వీటిలో వేసక్టమీ ఆపరేషన్లు 304 మాత్రమే. అలాగే ఈ ఏడాది లక్ష్యం 19 వేలు ఆపరేషన్లు కాగా ఇప్పటివరకు 6 వేల ఆపరేషన్లు జరిగాయి. వీటిలో 106 మాత్రమే వేసక్టమీ ఆపరేషన్లని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. పరిస్థితి దారుణంగా ఉందో ఈ లెక్కలే చెబుతున్నాయి.
మగతనం తగ్గుతుందన్న అపోహ
వేసక్టమి ఆపరేషన్ చేయించుకుంటే మగతనం తగ్గుతుందన్న అపోహ చాలా మందిని వేధిస్తోంది. గ్రామాల్లో నిరక్షరాస్యత కారణంగా వేసక్టమీ అంటేనే జనం భయపడుతున్నారు. ఈ ఆపరేషన్ వల్ల మగతనానికి ఎలాంటి ఇబ్బందీ లేదని వైద్యులు ఎంతగా చెబుతున్నా పురుషులు ముందుకు రావడంలేదు.
మహిళలు కూడా ఒప్పుకోవడం లేదు...!
మగవారు కు.ని. ఆపరేషన్ చే యించుకునేందుకు వారి భార్యలు కూడా ఒప్పుకోవడం లేదని ఆరోగ్య కార్యకర్తలు చెబుతున్నారు. తాము వంద కేసులను వైద్య శిబిరానికి తీసుకొస్తే చివరకు ఆపరేషన్ చేయించుకునే మగవారు వారు కేవలం ఇద్దరు, ముగ్గురు కంటే ఎక్కువ మిగలడం లేదంటున్నారు.
పురుషులు చేయించుకుంటేనే మంచిది
ఇదే విషయమై జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి గీతాంజలి మాట్లాడుతూ కు.ని. ఆపరేషన్లు మహిళలు క ంటే పురుషులు చేయించుకోవడమే మంచిదన్నారు. వేసక్టమీ చేయించుకుంటే మగతనానికి ఇబ్బంది, పని చేసుకోవడం ఇబ్బంది అన్నది అపోహేనన్నారు. ఎంత చైతన్యపరిచినా ముందుకు రాకపోవడం సరికాదన్నారు. ఆపరేషన్ చేయించుకున్న గంట తర్వాత యథావిధిగా ఇంటికి వెళ్లిపోవచ్చన్నారు. మరుసటి రోజు నుంచి తేలికపాటి పనులు, వారం తర్వాత యథావిధిగా పనులు చేసుకోవచ్చని సూచించారు.