లిఫ్ట్ ఇస్తామంటూ బంగారం చోరీ
పెదపాడు: ప్రయాణికుడిని కారులో లిఫ్ట్ ఎక్కించుకుని బంగారం చోరీ చేసిన సంఘటన పెదపాడు మండలం కొక్కిరపాడు అడ్డరోడ్డు వద్ద చోటుచేసుకుంది. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూ రుకు చెందిన కంకిపాటి కృష్ణమూర్తి గుడివాడలోని కుమార్తె ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో హనుమాన్ జంక్షన్ సెంటర్లో దిగాడు. ఏలూరు వేళ్లేందుకు వేచి ఉండగా తెల్ల కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఏలూరుకు వెళ్తున్నామని, వస్తారా అంటూ ఎక్కించుకున్నారు. కారును కలపర్రు టోల్గేట్ సమీపంలోని కొక్కిరపాడు అడ్డరోడ్డు వద్ద లోపలకు 50 మీటర్లు తీసుకువెళ్లి కృష్ణమూర్తి వద్ద ఉన్న నాలుగు బంగారు గాజులు, రెండు ఉంగరాలు, రెండు ఫోన్లు లాక్కుని ఉడాయించారు. దీంతో కృష్ణమూర్తి పెదపాడు పోలీసులను ఆశ్రయించాడు. పెదపాడు ఏఎస్సై ఎంవీ సత్యనారాయణ కేసు నమోదు చేశారు. ఏలూరు రూరల్ సీఐ అడపా నాగమురళి ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.