పడుతూ..లేస్తూ..
పడకేసిన ప్రాజెక్టులు
నత్తనడకన రైల్వే వంతెనల పనులు
ప్రతిపాదనలకే పరిమితమైన తుకారంగేట్
సిటీబ్యూరో: చుట్టూ నీరు.. మధ్యలో మౌన ముద్రలో ఉన్న తథాగతుడు.. నిత్యం వేలమంది సందర్శకులు.. ఆనందం కోసం బోటు షికారు.. హుస్సేన్ సాగర్ వద్ద నిత్యం ఇలాంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి. అయితే, బోటుపై జల విహారం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు బోటింగ్ నిపుణులు. కాళేశ్వరంలో పడవ బోల్తా సంఘటన జరిగిన నేపథ్యంలో పర్యటకులను అప్రమత్తం చేయనున్నారు. హుస్సేన్ సాగర్‌లో స్పీడు బోట్లు, రాజహంస, మెకనైజ్డ్, భాగమతి, భగీరథతో పాటు ఇటీవల వచ్చిన అమెరికన్ బోట్లు పర్యాటకులకు సాగర్‌లో సేవలందిస్తున్నాయి. అయితే, ఒక్కోసారి పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారు. ఇలాంటప్పుడు బోట్ల సామర్థ్యం తెలుసుకుని ఎక్కాలని సూచించారు నిపుణులు. డ్రైవర్ చెప్పినట్టుగా బరువు సమతుల్యత పాటించాలన్నారు. బోట్ సామర్థ్యానికి మించి ఎక్కినా, ప్రయాణించేటప్పుడు అందరూ ఒకే వైపు వెళ్లినా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. చిన్న బోట్లల్లో ప్రయాణించేవారు లైఫ్ జాకెట్ తప్పని సరిగా వేసుకోవాలన్నారు. ఒక్కసారి వేసుకున్న లైఫ్ జాకెట్‌ను తిరిగి ఒడ్డుకు చేరేదాకా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. బోట్లలో నిలబడడం గానీ, డాన్స్‌లు చేయడం చేస్టలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.
సిటీబ్యూరో: ‘నీవు ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు’ అన్నాడో సినీకవి. ఈ సామెత రైలుకే కాదు.. రైల్వే ప్రాజెక్టులకు సైతం సరిపోతుంది. మహానగరంలో ట్రాఫిక్ రద్దీ ఎలా ఉంటుందో తెలిసిందే. చాలా చోట్ల రోడ్డు మార్గాలను విడదీస్తూ రైలు ట్రాకులున్నాయి. ఈ ప్రాంతాల్లో ఒక్కసారి గేటు పడితే వేలాది వాహనాలకు బ్రేకులు పడతాయి. క్షణాల్లో ట్రాఫిక్ నిలిచిపోతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు నగరంలో వివిధ ప్రాంతాల్లో చేపట్టిన రైల్వే వంతెనల పనులు ఏళ్ల తరబడి నత్తనడకన సాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వే, జీహెచ్ఎంసీ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన ఆర్ఓబీలు, ఆర్యూబీల నిర్మాణం ఒక అడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నట్టుగా ఉంది. ప్రతి ఏటా వచ్చే రైల్వే బడ్జెట్లో ప్రజలకు మెరుగైన సదుపాయాల ‘కల్పన’గా మారుతున్నాయి. ప్రతిపాదనలు ఫైళ్లకూ పరిమితమవుతున్నాయి. చేపట్టిన పనులు పునాదులకే పరిమితమయ్యాయి. ఐదారేళ్ల పాటు పనులు సాగి ఇటీవల పూర్తయిన రైల్ నిలయం, ఆలుగడ్డ బావి, కందికల్ గేట్ రైల్వే వంతెనలు మినహా మిగతా చోట్ల నిర్మాణ పనులు పడకేశాయి. ఆకస్మాత్తుగా గేట్లు పడిపోవడంతో ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సఫిల్‌గూడ, తుకారంగేట్, మల్కాజిగిరి, ఉప్పుగూడ తదితర ప్రాంతాల్లోని ఆర్యూబీ, ఆర్ఓబీ నిర్మాణ పనులు మూడేళ్లుగా సాగుతునే ఉన్నాయి. దీంతో ఈ మార్గంలో వెళ్లే వాహనదారులు ట్రాఫిక్ నరకాన్ని అనుభవించాల్సి వస్తోంది. రైల్వే బడ్జెట్ నేపథ్యంలో నగరంలో నిలు పలు ప్రాజెక్టుల ప్రగతిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
సఫిల్‌గూడ రైలు మార్గంలో రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్యూబీ) నిర్మాణానికి 2001-02 బడ్జెట్లో రైల్వేబోర్డు అనుమతి ఇచ్చింది. 11 మీటర్ల పొడవు, 5 మీటర్ల వెడల్పుతో రూ. 31 కోట్ల నిధులతో బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదించారు. కానీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదు. బ్రిడ్జి నిర్మాణానికి కావలసిన స్థలాన్ని ఇచ్చేందుకు డిఫెన్స్ అధికారులు నిరాకరించడంతో ప్రాజెక్టు వాయిదా పడింది. డిఫెన్స్ నుంచి స్థల ం తీసుకునే అంశంలో ఇటు జీహెచ్ఎంసీ, అటు రైల్వే అధికారులు చొరవ చూపలేదు. దీంతో బ్రిడ్జి పనులు నిలిచిపోయాయి.
ఉత్తమ్‌నగర్ రైల్వే క్రాసింగ్ వద్ద మూడేళ్ల క్రితం రూ. 24 కోట్ల అంచనా వ్యయంతో ఆర్యూబీ పనులు చేపట్టారు. అవి ఇప్పటికీ నత్తనడకనే సాగుతున్నాయి. పైగా కేవలం రెండు లైన్ల కోసమే చేపట్టిన ఈ పనులను ప్రస్తుతం 4 లైన్లకు విస్తరించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. కానీ చేపట్టిన పనుల్లోనే నిర్లక్ష్యం రాజ్యమేలుతుండగా, మరో రెండింటి పనులు ఎప్పటికి విస్తరిస్తారనేది సందేహం.
పాతబస్తీలోని ఉప్పుగూడ రైల్వేగేట్ వద్ద ఆర్యూబీ నిర్మాణం కోసం 2007లో ప్రతిపాదనలు చేశారు. ఉప్పుగూడ- యాకుత్‌పురా మార్గంలో నిర్మించ తలపెట్టిన ఈ బ్రిడ్జి కోసం రూ. 10.84 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. కానీ ఇది కూడా కార్యరూపం దాల్చలేదు. ఇప్పటి వరకు ఒక్క అడుగూ పడలేదు.
ఈస్ట్ ఆనంద్‌బాగ్ వద్ద చేపట్టిన ఆర్యూబీ నిర్మాణం కూడా రెండేళ్లుగా కుంటి నడకే నడుస్తోంది. ఈ పనుల్లో అడుగడుగునా నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది.లాలాగూడ రైల్వేస్టేషన్‌ను ఆనుకుని ఉన్న తుకారాంగేట్ వద్ద ఆర్యూబీ కోసం దశాబ్దం కిందటే ప్రణాళిక రూపొందించారు. ఈ మార్గంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడ ఆర్యూబీ కోసం ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. లాలాగూడ స్టేషన్ చుట్టూ ఉన్న వందలాది కాలనీలు ఈ గేట్ నుంచి రాకపోకలు సాగిస్తాయి. గేటు పడిందంటే గంటల తరబడి పడిగాపులు కాయాల్సిందే.
గేటు పడితే ఇక అంతే..
తుకారాం గేట్ పడిందంటే ప్రయాణంపై ఆశలు వదులుకోవాల్సిందే. ఒక్కోసారి ఒకదాని వెనుక ఒకటి నాలుగైదు రైళ్లు పరుగులు తీస్తాయి. గంటకు పైగా బండి ఆపుకుని నిలబడాల్సిందే. సమయానికి గమ్యం చేరుకోవడం అసాధ్యం. ఈ గేట్ విషయంపై ప్రభుత్వం శ్రద్ధ చూపాలి. - సాజిద్
ఇంత నిర్లక్ష్యమా..!
ప్రతి సంవత్సరం ఏవేవో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించడం కాకుండా ఆర్ఓబీలు, ఆర్యూబీల విషయంలో నిర్ధిష్టంగా పనులు ప్రారంభించాలి. లక్షలాది మంది రాకపోకలు సాగించే మార్గాల్లో ఇంతటి నిర్లక్ష్యం సరైంది కాదు. - భాను