‘ముక్కోటి’కి గుట్ట ముస్తాబు
యాదగిరికొండ: వైకుంఠ(ముక్కోటి) ఏకాదశికి యాదగిరిగుట్టలోని శ్రీలక్ష్మినరసింహస్వామి ఆలయం ముస్తాబైంది. ఆలయాన్ని రంగురంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా దేవస్థానం అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయం వెలుపల తూర్పు ద్వారం ద్వారా దర్శనం ఇవ్వనున్న స్వామి అమ్మవారి సేవకు క్యూలైన్లు ఏర్పా టు చేశారు. భక్తుల కోసం సుమారు 85 వేల లడ్డూలు, 85 వేల పులిహోర ప్యాకెట్లు తయారు చేశారు. కొండ కింద నుంచి వచ్చేవాహనాలను తులసీ కాటేజీలోనే నిలిపివేసేలా పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు.
నేడు వైకుంఠ ద్వార దర్శనం
దుష్టశిక్షణ శిష్టరక్షణ చేసే నారసింహుడు వైకుంఠం వదిలి భూలోక భక్తుల చెంతకు చేరే సందర్భం రానే వచ్చింది. గురువారం తెల్లవారుజామున 6.45 గంట లకు స్వామి అమ్మవారు అలంకార ప్రియులై గరుడవాహన సేవపై భక్తులకు దర్శనమిచ్చి, తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. అంతకుముందు ధనుర్మాసోత్సవాలలో భాగంగా తిరుప్పావై పఠనం చేస్తారు.
సామాన్య భక్తులకు దర్శనం సులభతరం
ఈ ముక్కోటి ఏకాదశికి వచ్చే భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకునే అవకాశాన్ని సులభతరం చేశారు. ఇందుకోసం వీఐపీలకు బ్రేక్ దర్శనం ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటల నుంచి 9గంటలవరకు, 11గంటల నుంచి 12గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4గంటల నుంచి 5గంటల వరకు వీఐపీలు దర్శనం చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఈ ముక్కోటి ఏకాదశికి 1500 మంది భక్తులకు దేవస్థానం ఉచిత అన్నదానం ఏర్పాటు చేసింది.
నేటి నుంచి అధ్యయనోత్సవాలు
గుట్ట దేవస్థానంలో గురువారం నుంచి ఐదు రోజులపాటు అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల సందర్భంగా స్వామి అమ్మవారి గజ, గరుడ, అశ్వ, శేష, ఆంజనేయ తదితర వాహనాలకు తిరుమంజనం చేశారు.