బీఆర్ఏయూలో ఇంజినీరింగ్ విభాగం
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ యూనివర్సిటీలో వచ్చే ఏడాది ఇంజినీరింగ్ విభాగాన్ని ప్రారంభించనున్నామని రిజిస్ట్రార్ వడ్డాది కృష్ణమోహన్ చెప్పారు. విశాఖపట్నంలోని ఏయూలో మంగళవారం జరిగిన ఎంఎన్‌డీసీ (విశ్వవిద్యాలయాల పర్యవేక్షణ, అభివృద్ధి కమిటీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బుధవారం ఆయన సీడీసీ డీన్ గుంట తులసీరావుతోకలిసి విలేకరులకు వివరించారు. ప్రతి జిల్లాకు ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల విధానం మేరకు బీఆర్ఏయూలో ఇంజినీరింగ్ కోర్సుల ప్రారంభానికి అవకాశం లభించిందని చెప్పారు. ఇందుకోసం ఎస్ఎం పురంలోని 21వ శతాబ్ధి గురుకులాన్ని వ ర్సిటీకి అప్పగించే అంశాన్ని ఉన్నత విద్యామండలి పరిశీలిస్తుందన్నారు.
రెగ్యులర్ బోధకులను నియమించగానే తొలుత సివిల్, మెకానికల్, ట్రిపుల్ఈ, సీఎస్ఈ, ఈసీఈ బ్రాంచిలు ప్రారంభిస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న మిర్యాల చంద్రయ్యను రెక్టార్‌గా నియమించేందుకు ఎంఎన్‌డీసీ అనుమతి తీసుకున్నామని, ఆయనకు త్వరలో నియామక ఉత్తర్వులు అందజేస్తామని చెప్పారు. మహిళా వసతిగృహంపై రూ.18.60 లక్షల అంచనాతో మరో 11 గదుల నిర్మాణానికి టెండర్లు పిలవనున్నామని తెలిపారు. 34 రెగ్యులర్ బోధకుల భర్తీకి సంబంధించి అవసరమైన వివరాలను గవర్నర్ నామినీకి ఇప్పటికే పంపామని, ప్రభుత్వం మం జూరు చేసిన మరో 15 పోస్టులకు కూడా రోస్టర్ పాయింట్లు, సబ్జెక్టుల వారీగా జాబితా అందజేసి త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. డీపీడీ కోర్సు, దూర విద్యాకేంద్రాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నామని వెల్లడించారు. దూరవిద్య ద్వారా ఏయే కోర్సులు నిర్వహించలనేది త్వరలో నిర్ణయిస్తామని పేర్కొన్నారు.