నాంపల్లి కోర్టుకు టుండా
1998లో పట్టుబద్ద సలీం జునేదీ కేసులో నిందితుడు
కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య తిరిగి ఢిల్లీకి
సిటీబ్యూరో: లష్కర్-ఇ-తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండాను అత్యంత కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య ఢిల్లీ పోలీసులు బుధవారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు హైదరాబాద్‌లో బాంబు పేలుళ్ల కుట్రకు పాల్పడిన కేసులో ఆయన నిందితుడు. బాబ్రీమసీదు విధ్వంసానికి ప్రతీకారంగా నగరంలో విధ్వంసం సృష్టించేందుకు కుట్రపన్నిన పాకిస్తాన్ జాతీయడు సలీం జునేదిని నగర పోలీసులు 1998 జులై 1న ఆరెస్టు చేసి సెలైన్సర్తో కూడిన పిస్టల్, 18 కేజీల ఆర్డీఎక్స్ పేలుడు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదే సమయంలో అతనికి సహకరించిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన అబ్దుల్ కరీం టుండా విదేశాలకు పారిపోయాడు. అతన్ని గత ఏడాది ఆగస్టులో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పీటీ వారెంట్‌పై సిట్ పోలీసులు ఢిల్లీ నుంచి టుండాను తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచి, చార్జీషీట్ దాఖలు చేశారు. బుధవారం కేసు విచారణ ఉండడంతో ఢిల్లీ జైలులో ఉన్న టుండాను అక్కడి పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య విమానంలో నగరానికి తీసుకువచ్చారు.
కోర్టులో హాజరుపరచి, విచారణ అనంతరం సాయంత్రం ఆరు గంటలకు తిరిగి విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లో వస్త్ర వ్యాపారి అయిన టుండా బాబ్రీ మసీదు విధ్వంసానికి ప్రతీకారంగా డెహ్రాడూన్, లక్నో, ఘజియాబాద్, ముంబై, అలీఘర్‌లతో పాటు గణేష్ ఉత్సవాలకు ముందు హైదరాబాద్‌లో భారీ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో సలీం జునేదీకి విధించిన ఐదేళ్ల శిక్షా కాలం చర్లపల్లి జైలులో ముగియడంతో అతన్ని రెండేళ్ల క్రితం పాకిస్తాన్‌కు పంపించారు. ఇదే కేసులో టుండా విచారణ ఎదుర్కొంటున్నారు.