యాపిల్ చేతికి... హైదరాబాద్ స్టార్టప్ టుప్లేజంప్
యాపిల్ స్టోర్, ప్రాసెస్, బిగ్‌డేటాకు ఊతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ హైదరాబాద్‌కు చెందిన మెషిన్ లెర్నింగ్ స్టార్టప్ ‘టుప్లేజంప్’ను సొంతం చేసుకుంది. డీల్ విలువ ఎంతనేది మాత్రం వెల్లడించలేదు. ఈ ఏడాది యాపిల్ ఇప్పటికే రెండు సంస్థల్ని కొనుగోలు చేసింది. మొదట పర్సిప్షోను, రెండు నెలల క్రితం తురీ అనే స్టార్టప్నూ కొనుగోలు చేసింది. టుప్లేజంప్ కొనుగోలుతో యాపిల్ స్టోర్, ప్రాసెస్, బిగ్‌డేటా విజువలైజేషన్ మరింత బలోపేతమవుతుందని కంపెనీ ప్రతినిధి తెలిపారు. సత్యప్రకాశ్ బుద్ధవరపు, రోహిత్ రాయ్ కలిసి 2013లో టుప్లేజంప్ను ప్రారంభించారు.
కొనుగోలు అనంతరం టుప్లేజంప్ వెబ్సైట్ పనిచేయడం మానేసింది. టుప్లేజంప్ టీమ్‌కు అపాచి స్పార్క్ ప్రాసెసింగ్ ఇంజిన్, కాసెండ్రా ఎస్‌క్యూఎల్ డేటాబేస్, అపాచి కఫ్కా డిస్ట్రిబ్యూటెడ్ హై-త్రోపుట్ సబ్‌స్క్రైబ్ సిస్టమ్స్ల్లోనూ పరిచయం ఉంది. మే నెలలో దేశంలో పర్యటించిన యాపిల్ సీఈఓ టిమ్ కుక్ హైదరాబాద్‌లో యాపిల్ మాప్స్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించడం తెలిసిందే.