కొట్టుకుపోయిన రోడ్లు.. కూలిన ఇళ్లు
తూప్రాన్‌లో భారీగా వర్షం
తూప్రాన్: మండలంలో గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షానికి తూప్రాన్ మండలంలోని వాగులు, చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. శనివారం అర్ధరాత్రి కురిసిన భారీ వర్షానికి అనేక మంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శనివారం మండలంలో 16 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. వర్షాలకు మండలంలో 270 ఇళ్లు కూలినట్లుగా గుర్తించినట్లు తహసీల్దార్ వెంకటనర్సింహారెడ్డి తెలిపారు.
వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో తూప్రాన్-గుండ్రెడ్డిపల్లి రహదారి, వట్టూరు- శివ్వంపేట మండలం గుండ్లపల్లి, నాగులపల్లి- వెల్దుర్తి రహదారి, తూప్రాన్- కిష్టాపూర్ రహదారులు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. కాగ పట్టణంలోని దేవి గార్డెన్ వద్ద తూప్రాన్ -నర్సాపూర్ రహదారిపై నుంచి వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో ఉదయం నాలుగు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి.