అవి కావు జంతువులు
క్లాసిక్ కథ
ఎర్రని యెండ. తారు వేసిన ఆ రోడ్డులోంచి వేడి తెరలు తెరలుగా పైకి లేస్తోంది. రోడ్డు పక్కగా ఒక పెద్ద చింతచెట్టు... మూర్ఛపోయిన వానిలా అచేతనంగా ఉంది. దాని నీడ కూడా వేడిగా ఉంది. కాని దానికంటె నీడగల చెట్టు ఆ ప్రాంతాలలో మరొకటి లేదు. అందువల్ల తాము తోలుకు వచ్చిన ఎడ్లను నీడలో నిలిపి, చింతచెట్టు బోదె వద్ద ఆసాములు నిద్రపోతున్నారు. చెమటలు కారిపోతున్నాయి.
అలిసిపోయిన ఈటె కొమ్ములది నిద్రపోతోంది. నీడలో పడుకున్నా, దాని కళ్లల్లో కన్నీళ్లు ధారలు కడుతూనే వున్నాయి. దాని ఒంటిమీద ములుకర్ర దెబ్బల గుర్తులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈటె కొమ్ములది ఒక ముసలి ఎద్దు. దాన్ని కొమ్ములు రెండూ ఈటెల్లా వాడిగా వుండడం వల్ల, ఆసాములు దానికా పేరు పెట్టారు. పుట్టినప్పట్నుంచీ అలవాటైన ఆ చోటికి తలవని తలంపుగా రావడంతో ‘అంబా’ అంటూ అరిచి పడుకుంది.
దాని జత యెద్దయిన పొడుగు కొమ్ములది ఎక్కడుందో యేవిటో, ఆ అరుపు విని కంచె దాటి అక్కడికి వచ్చింది. ఈటె కొమ్ముల యెద్దు ఒంటిమీద కనిపిస్తున్న దెబ్బల్ని తన నాలుకతో మెల్లగా నాకుతూ అక్కడ నిలిచింది.
అక్కడింకా యిరవై ముప్ఫయి ముసలి యెడ్లూ, వట్టిపోయిన ఆవులూ వున్నాయి. అవి ఎక్కడికి వెడుతున్నవో వాటికి తెలియదు. ఆసాముల ములుకర్రల దెబ్బలకు జడిసి, నడిచేటప్పుడు దారిలో కనిపించిన గడ్డీ గాదం త్వరత్వరగా తినడం చేత, యిప్పుడు కళ్లు మూసుకుని నెమరు వేసుకుంటున్నాయి. మనిషికి ఒక జానెడు, పశువుకి ఒళ్లంతా పొట్ట - అంటారు. అందువల్ల ఏదో ఒకటి తినాలిగా మరి!
‘‘పొడుగు కొమ్ములూ, అదుగో కనిపిస్తోందే ఆ తోటలో మనం జతగా పనిచేసిన ఆ రోజులు తలుచుకుంటే నాకిప్పుడు ఒళ్లు జలదరిస్తోంది. రేయింబవళ్లూ చెరకు తోటకు నీళ్లు తోడి పోసేటప్పుడు, ఒకసారి ఆసామి నిద్రపోయి నీ మీద పడ్డాడు. అప్పుడు కనక నువ్వు అడుగు తీసి అడుగు వేస్తే, అతనికి దెబ్బ తగులుతుందని బరువంతా మోస్తూ కదలకుండా అలాగే నుంచున్నావు, గుర్తుందా?’’ అంది అలసిపోయిన ఈటె కొమ్ములు, తెచ్చుకున్న ఉత్సాహంతో.
‘‘అదంతా యిప్పుడు గుర్తు చేసుకోవడం దేనికి? నిన్ను మళ్లీ చూడడంతో నాకు కలిగిన సంతోషం యింతా అంతా కాదు. ఏవేవో మాట్లాడి, యీ సమయాన్ని ఎందుకు వృథా చేసుకోవడం?’’ అని విసుక్కుంది పొడుగు కొమ్ములు.
‘‘అది సరే కాని, నువ్వు నన్నెలా వెతుక్కుంటూ వచ్చావ్?’’
‘‘ఈ పక్కనేగా వుంది మా ఆసామి తోట. నీ గొంతు వినిపించింది. మరి రాకుండా వుంటానా? కంచెను ఒక్క అదుము అదిమి, దాటి వచ్చేశాను.’’
కందప్పన్ పుదూర్ అనే ఊరికి దగ్గరగా వున్న రహదారిలో ఈ యెడ్ల జత విడివడిపోయి, తలవని తలంపుగా ఇవాళ మళ్లీ కలుసుకున్నాయి. తమ మౌన భాషలో మాట్లాడుకోసాగాయి. ఇక్కడి నుంచి కందప్పన్ పుదూర్ ముప్ఫయి మైళ్ల దూరంలో ఉంది.
ఆ ఊరి ఆసామి ఒకాయన ఈ రోడ్డులో ప్రతి గురువారం జరిగే సంతలో ఒకసారి ఈటె కొమ్ముల్ని అమ్మివేశాడు. ఇప్పుడది ఆ ఊరికి పక్కగా పోతున్న బాటగుండా ఇతర పశువులతో పాటు కేరళ దేశానికి వెడుతోంది. గొడ్లు తోలుకొని వెడుతున్న ఆసాములు విశ్రాంతి కోసమని ఆ చింతచెట్టు నీడను విశ్రమించడం యాదృచ్ఛికంగా జరిగింది.
ఈటె కొమ్ములు వీపు విరుచుకుని పక్కకు తిప్పుకుని మళ్లీ పడుకుంది. పొడుగు కొమ్ములు నాకుతూ వుంటే ఎక్కడలేని సుఖం కలిగింది దానికి.
‘‘అబ్బా! వాళ్లు నన్నెక్కడికి తోలుకుపోతారే యేవిటో! ఇంకా ఎంత దూరం నడవాలో! ఈ ములుకర్ర దెబ్బల్ని మాత్రం నేను భరించలేకుండా వున్నాను. నాకే మాంఛి దెబ్బలు తగులుతున్నాయి.’’
‘‘అవును. నీ కాలు కుంటి. దెబ్బలు తప్పించుకుని నువ్వెలా ముందుకి నడుస్తావ్?’’ పొడుగు కొమ్ములు కళ్లు చెమ్మగిల్లాయి.
ఆ జత యెడ్లు చాలా యేళ్లుగా ఒక ఆసామి వద్ద రాత్రనక పగలనక కష్టపడి పనిచేశాయి. వాడి కొమ్ములు ఎడమవైపు కాల్లోకి ఎలాగో ఒక మేకు దూరింది. మొదట్లో దీన్ని గమనించలేదు. ఆ తర్వాత చికిత్స చేశారు. గుణం మాత్రం కనిపించలేదు. చివరికది కుంటిదయింది. అప్పుడు ఆసామి దాన్ని కేరళ నుంచి వచ్చిన ఒక ఆసామికి ఈ రోడ్డు సంతలో నూరు రూపాయలకు అమ్మివేశాడు.
కందప్పన్ పుదూరు దగ్గరగా కేరళకు వెళ్లే రహదారి వుండడం వల్ల, ఆ జత యెడ్లు మళ్లీ కలుసుకునేందుకు అవకాశం కలిగింది.
‘‘పోయిన సంవత్సరం నాలుగెకరాల్లో మన ఆసామి పసుపు వేశాడు. గుర్తుందా నీకు?’’ అడిగింది పొడుగు కొమ్ములు. ఇలాంటి విషయాలు గుర్తు చేయవద్దనే అది యిందాక చెప్పింది. కాని యెడ్లకు మాట్లాడుకునేందుకు వేరే విషయాలు ఏముంటాయి?
‘‘అప్పుడే మరిచిపోతాననుకున్నావా? పసుపు పంటకి వంద నీళ్లంటారు. మనమేగా అన్ని నీళ్లూ తోడిపోసింది.’’
‘‘బళ్లకొద్దీ పెంటపోగు తోలింది కూడా మనమేగా? పసుపు బాగా పండింది.’’
‘‘ఆ యేడు దానికి మంచి ధర పలికింది కూడా. ఆసామి బోలెడు గడించాడు’’ అని వాడి కొమ్ములు తన కష్టాలన్నీ మరిచిపోయి చెప్పుకుంది.
‘‘నువ్వు నీళ్లు తోడిపోశావు. ఆసామికి’’ అని వాడి కొమ్ములు చెపుతుంటే, మాటకు అడ్డం వచ్చి, ‘‘నువ్వు కూడా నాతోపాటు కష్టపడ్డావు గదా! ఆసామి సంచిలో ఎన్ని వంద రూపాయల నోట్లు పడ్డాయో!’’ అంది పొడుగు కొమ్ములు.
అప్పుడు నిద్రపోతున్న ఆసాములు యిద్దరూ లేచారు. వెంటనే వాళ్లు బీడీలు ముట్టించుకున్నారు. మాటలు సాగాయి వాళ్ల మధ్య.
‘‘ఆ మనిషిని చూశావా? వచ్చే యేడు అమ్ముతాడట!’’
‘‘ఏ మనిషంటావు!’’
‘‘వాడే, సంతకు రాలేదూ, బాడుగ ఒంటెద్దు బండివాడు. ఇంకా ఒక సంవత్సరం దాంతో కాలక్షేపం చేసి, బాగా దాన్ని చావబాది, ఆ తర్వాత అమ్ముతాడట.’’
‘‘దానికి యాభై రూపాయలు మంచి ధరే అనుకుంటా.’’
‘‘వాడు బలే మనిషిలే. వచ్చే యేడు ఇరవై అయిదు వచ్చినా చాలట. అలా అని వాడే చెప్పాడు.’’
‘‘అవును. ఆ యెద్దుతోనే వాడు సంవత్సరం తిరిగే సరికల్లా అయిదు వందలకు పైగా సంపాయిస్తాడు.
అటువంటప్పుడు యిప్పుడెందుకు అమ్ముతాడు?’’
వాడు లెక్కా డొక్కా తెలిసిన ఘటం! గొడ్డు బాగా అలిసిపోయి, నేలకు ఒరిగేంత దాకా దాన్ని పిండి, పిప్పి చేస్తాడు. ఆ తర్వాత ఏం ధర పలికితే మాత్రం యేం! ఆ వచ్చే డబ్బుని కూడా విడిచిపెట్టడు.’’
ఆలమందల్ని తోలుకు వెళ్లేటప్పుడు కూడా ఏమాత్రం దయాదాక్షిణ్యాలు చూపకుండా, వాటిని ములుకర్రలతో బాధించే ఆ మనుషుల మాటల్ని అర్థం చేసుకోవాలని పొడుగు కొమ్ములూ వాడి కొమ్ములూ ఆశించాయి.
కాని ఒక మనిషి మాటల్ని మరో మనిషి సరిగా అర్థం చేసుకోలేకపోతున్నాడు. అర్థం చేసుకో గలిగితే... అన్న మాటలకు భిన్న అర్థ తాత్పర్యాలు, ప్రతివిమర్శలు, వివాదాలు ఎందుకు బయలుదేరుతాయి? మనుషుల పరిస్థితే యిలా వుంటే, ఆ మనుషుల్ని గొడ్లు ఎలా అర్థం చేసుకోగలుగుతాయి? ఇదీ ఒక విధంగా మంచిదనే తోస్తోంది. ఎందుకంటారా - ప్రయాణం చివర ఏం జరుగుతుందో ముందే తెలియకుండా వుంటే, అంతవరకైనా బాధ తప్పుతుంది గదా!
వాడి కొమ్ములకీ పొడుగు కొమ్ములకీ వాళ్ల మాటలు ఏమీ అర్థం కాలేదు. ముఖాలు చూసుకున్నాయి. మనిషే సరిగ్గా అర్థం చేసుకోలేనప్పుడు, పాపం గొడ్లకేం తెలుస్తాయి మాటలు?
ఇంకా కాలితే, వేళ్లు కాలుతా యన్నంతగా బీడీలు చిన్నవైనాయి. అందువల్ల వాటిని పారేసి, మళ్లీ వాళ్లు పడుకున్నారు. పొడుగు కొమ్ములూ వాడి కొమ్ములూ మళ్లీ మాటల్లోకి దిగాయి.
‘‘మన ఆసామివాళ్ల నాన్న పక్షవాతంతో ఆసుపత్రిలో పడుకున్నాడు గదా’’ అంది వాడి కొమ్ములు.
‘‘అవును. ఆ మూడేళ్లూ ప్రతిరోజూ పది మైళ్లు ఆసుపత్రికి వెళ్లి, మళ్లీ యింటికి వచ్చేవాళ్లం. ఒక్క రోజయినా నాగా పడలేదు.’’
పొద్దున పూటేమో పొలంలో మంచి పని. సాయంకాలం బండిలో అందర్నీ మోసుకుని పది మైళ్లు ఆసుపత్రికి వెళ్లాలి. మళ్లీ పది మైళ్లు పరుగు.’’
‘‘కాలు పడిపోయిన వాళ్ల నాన్నను మన ఆసామి బాగానే చూశాడు.
కాని ఆయన లేచి తిరక్కుండానే కళ్లు మూశాడు. ఆయన అస్థుల్ని కావేరిలో కలపడానికి మన బండే కట్టారు. అప్పుడు... పాపం... మన ఆసామి వెక్కి వెక్కి యేడ్చాడు.’’
అవి యిలా మాట్లాడుకుంటూ వుండగా, బిగ్గరగా కేకలు వేసుకుంటూ అక్కడికి వచ్చాడు ఆసామి. ఆ రోజు పొడుగు కొమ్ముల్ని మరో యెద్దుతో జతచేసి, పొలం దున్నాలని ఆయన అనుకున్నాడు.
కాని కట్టుకొయ్య వద్ద పొడుగు కొమ్ములు కనిపించలేదు. వెంటనే దాన్ని వెతకడం కోసం మనుషుల్ని పంపించాడు మూడు వైపులకీ. తానేమో తమలపాకులు వేసుకుంటూ చింతచెట్టు నీడలో గొడ్లు వుండడం చూసి, అక్కడికి వచ్చాడు. పొడుగు కొమ్ముల్ని చూశాడు. అంతే...
‘‘ఓహో! ఆ కుంటిదాని మీద నీకింత ప్రేమా! నీకోసం అన్ని చోట్లూ గాలించమని చెప్పి వచ్చాను.
వాళ్ల పనిని కాస్తా పాడుచేశావ్! నీకు వేడి వేడి దెబ్బలు తగలాలి’’ అంటూ అక్కడున్న కంచెలోని ఒక తీగను మెలిపెట్టాడు. పొడుగు కొమ్ములు పడుకున్న చోటికి కోపంతో నడక సాగించాడు.
సరిగ్గా ఆ సమయానికి ఎక్కడినుంచో వచ్చింది ఒక కుక్క అక్కడికి ఆసామిని కరవడానికి. దాన్ని చూస్తేనే పిచ్చి కుక్కని తెలుస్తుంది.
ఎంత ప్రయత్నించినా దాని బారి నుంచి తప్పించుకోలేకపోయాడు ఆసామి.
వాడి కొమ్ములు గభాలున లేచి, ఆ కుక్క మీదికి ఉరికింది. కుక్క కాటుకు కూడా వెరవకుండా, ఎద్దు తన కొమ్ములతో దాన్ని పొడిచి చంపేసింది. దానికెందుకో అంత కోపం వచ్చింది. ఆ పిచ్చి కుక్కతో పోరాడడం వల్ల, అలిసిపోయి రోజుతూ రొప్పుతూ నుంచుంది.
వాడి కొమ్ములు కాలికి తగిలిన దెబ్బల్ని పొడుగు కొమ్ములు నాకసాగింది. ఆ దెబ్బల బాధను పోగొట్టాలనుకుంది కాబోలు!
పిచ్చికుక్క కాట్లను నాకడం వల్ల, పొడుగు కొమ్ములుకి పిచ్చెక్కుతుందని ఆసామి అనుకున్నాడు.
ఇక ఆ యెద్దువల్ల ఆసామికి లాభం లేదు.
పిచ్చికుక్కతో జరిగిన పోరాటం మూలంగా అక్కడున్నవాళ్లంతా మేల్కొన్నారు.
‘‘ఏమయ్యా! వాడి కొమ్ముల జత యెద్దయిన ఆ పొడుగు కొమ్ముల్ని కూడా కొంటావా?’’ అని అడిగాడు ఆసామి.
‘‘నిన్ననే అడిగాను గదయ్యా! అప్పుడేమో యివ్వనన్నావు.’’
‘‘యిప్పుడిస్తానంటున్నానుగా. ఎంత యిస్తావు?’’
‘‘ఆ వంద రూపాయలే. జతలోని యెద్దే, భేదం వుండకూడదు.’’
‘‘సరే యివ్వండి’’ అని ఆసామి వంద రూపాయలు తీసుకుని రొండిలో దూర్చుకున్నాడు.
ఆ జత యెడ్లూ ఆ బాటమీద యితర గొడ్లతోపాటు కేరళ వైపుగా బయలు దేరాయి. ధణా ధణా అనే ములుకర్ర దెబ్బలు గొడ్లు బయలుదేరుతున్నాయని సూచించాయి.
పొడుగు కొమ్ములుకి ఏమీ తోచలేదు. కాని పిచ్చికుక్క బారి నుంచి ఆసామిని కాపాడిన వాడి కొమ్ములతో కలిసి నడిచి వెళ్లడం దానికెంతో సంతోషంగా ఉంది. తన ఆసామి ఆ గొడ్లతో పాటు తననూ ఎందుకు జత చేశాడో దానికి అర్థం కాలేదు.
ఆ విషయం గురించి ఆలోచించేలోగా దాని వీపుమీద చుర్రుమంటూ ఒక దెబ్బ తగిలింది. వాడి కొమ్ములుకి అయిదారు దెబ్బలు తగిలాయి.
‘‘మహా దొంగ గొడ్డిది. అటూ యిటూ పరుగెత్తి ఆ కుక్కతో పోట్లాడింది. ఇప్పుడేమో కుంటుతోంది. వఠ్ఠి దొంగ గొడ్డు’’ అని సెలవిచ్చాడు ఒక ఆసామి.
- తూరన్