అతి పేద్ద విమానం.. వెళ్లిపోయింది!
టేకాఫ్ తీసుకున్న ‘అంటనోవ్ ఏఎన్ 225’
శంషాబాద్: దేశంలో తొలిసారిగా శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండైన అతి పెద్ద కార్గో విమానం ‘అంటనోవ్ ఏఎన్ 225’ శుక్రవారం అర్ధరాత్రి టేకాఫ్ తీసుకుంది. తుర్కమెనిస్థాన్ దేశంలోని తుర్కమెంబాషి విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఏఎన్ 225 గురువారం అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న విషయం తెలిసిందే. ఇందులో మధ్య ఆస్ట్రేలియాలోని ఓ అల్యూమినియం కంపెనీకి 117 టన్నుల పవర్ జనరేటర్‌ను తీసుకెళుతున్నారు.
మార్గమధ్యంలో విశ్రాంతితోపాటు ఇంధనం నింపుకోడానికి శంషాబాద్ విమానాశ్రయంలో దీన్ని 25 గంటలపాటు నిలిపారు. రాత్రి 1.45 గంటలకు విమానం టేకాఫ్ తీసుకుంది. ఇది ఇండోనేషియాలోని జకర్తాకు బయలుదేరినట్లు సమాచారం. ఈ అతి పెద్ద విమానానికి విమానాశ్రయ వర్గాలు ఘనంగా వీడ్కోలు పలికాయి.