వచ్చే ఏడాది 5.5% వృద్ధి: గోల్డ్‌మన్ శాక్స్
ముంబై: వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారత్ 5.5% వృద్ధి సాధిస్తుందని అమెరికా బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ శాక్స్ అంచనా వేస్తోంది. ఈ అంచనాల్లో ఎలాంటి రాజకీయ పరిస్థితుల ప్రమేయం లేదని గోల్డ్‌మన్ శాక్స్ ఇండియా ముఖ్య ఆర్థిక వేత్త తుషార్ పొద్దార్ వివరించారు. మూలధన పెట్టుబడులు స్వల్పంగా పెరిగే అవకాశాలుండటం, ఎన్నికల తర్వాత సంభవించే సాధారణ వృద్ధి తదితర అంశాల కారణంగా ఈ వృద్ధి రేటును నిర్ణయించామని పేర్కొన్నారు. బీజేపీకి చెందిన నరేంద్ర మోడి ప్రధానవుతారని అందుకనే భారత స్టాక్‌ల రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నామని ఈ నెల మొదట్లో ఈ కంపెనీ పేర్కొంది. దీంతో వివిధ కేంద్ర మంత్రుల నుంచి విమర్శలు వెల్లువలా వచ్చాయి. రాజకీయాలు చేయకుండా గోల్డ్‌మన్ శాక్స్ తన పని చూసుకోవాలంటూ పలువురు కేంద్ర మంత్రులు విమర్శలు గుప్పించారు. దీంతో తాజా అంచనాల్లో రాజకీయాలను పరిగణనలోకి తీసుకోలేదని నిపుణులంటున్నారు. ఈ ఏడాదిలో 4.3% వృద్ధి నమోదవుతుందని అభిప్రాయాన్నే పొద్దార్ పునరుద్ఘాటించారు.