గెలిచే హక్కు ఆప్కే ఉంది
న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో గెలిచే హక్కు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)కే ఉందని అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ షో ‘బాలికా వధు’లో కీలకపాత్రధారిణి అయిన నటి స్మితా బన్సల్ అభిప్రాయపడింది. ఇందుకు కారణం సమాజంలోని అన్ని సామాజిక అంశాలపై పోరాడే ధైర్యం ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఉండడమేనన్నారు. ఢిల్లీ విధానసభ ఎన్నికలపై వచ్చిన ఎగ్జిట్ పోల్స్‌పై ఆదివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ‘ఇది పూర్తిగా నగరవాసుల తీర్పు. ఏదిఏమయినప్పటికీ ఆప్కే నా మద్దతు.
ఎన్నికల ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉంది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మాత్రం ఆప్కే అనుకూలంగా వచ్చాయి. భవిష్యత్తుకు ఇది ఎంతో మంచిది’అని ఆమె పేర్కొన్నారు. ఆప్కే ఎందుకు మద్దతు పలకాలని నిర్ణయించుకున్నారని అడగ్గా... ఇవ్వగలిగిన సత్తా అరవింద్‌కే ఉంది. ఇచ్చిన వాగ్దానాలను ఆయన మాత్రమే నిలబెట్టుకోగలుగుతారు. ఆయన నగరవాసులకు ఏదైనా మాట ఇచ్చాడంటే దానిని నిలబెట్టుకుంటారు. ఎన్నికల సందర్బంగా ఆప్ విడుదల చేసిన మేనిఫెస్టోలోని అన్ని హామీలు కార్యరూపం దాలుస్తాయి. ఆప్... ప్రజల పార్టీ. దేశానికి అవసరమైన మార్పునకు ఆప్ సంకేతం. మహిళా భద్రత, అవినీతి పెద్దపెద్ద అంశాలకు సంబంధించి ఆ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుంది. సామాన్యుడికి ఏది అవసరమో ఆ పార్టీకి తెలుసు’అని అన్నారు.