టీవీ సిగ్నళ్లతో వై-ఫై ఇంటర్నెట్!
ఇక మీదట ఇంటర్నెట్ మరింత సులభంగా అందరికీ అందుబాటులోకి రానుంది. టీవీ సిగ్నళ్ల ఫ్రీక్వెన్సీ ద్వారా వై-ఫై నెట్వర్కులను అందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కేఐటీలోని జర్మన్ శాస్త్రవేత్తలు ఈ దిశగా పరిశోధనలు సాగిస్తున్నారు. ఉచితంగా అందుబాటులో ఉండే టీవీ సిగ్నళ్లను వై-ఫై సిగ్నళ్లు అందించడానికి ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుంది. సాధారణంగా తక్కువ స్థాయిలో ఉండే టీవీ ఫ్రీక్వెన్సీలు గోడల్లాంటి అడ్డంకులను కూడా అధిగమించి వెళ్లేందుకు చాలా అనుకూలంగా ఉంటాయి.
దీనిద్వారా ఉచితంగా కమ్యూనికేషన్లను అందించవచ్చని కూడా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది గనక పూర్తిగా సాధ్యమైతే, కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న వాళ్లకు కూడా వైర్లెస్ ల్యాన్ అందుతుందని చెబుతున్నారు. పక్కన వీధిలో వెళ్తుండగా స్మార్ట్ఫోన్లు చేతిలో ఉంటే.. ఈ సిగ్నళ్లను హాయిగా ఉపయోగించుకోవచ్చు. ఈ పరిశోధన ఫలితంగా వ్యక్తులు, సంస్థలు, కంపెనీలు ఖరీదైన మొబైల్ కమ్యూనికేషన్ల గురించి బాధపడక్కర్లేదని పరిశోధనలకు నేతృత్వం వహించిన ఆర్న్డ్ వెబర్ తెలిపారు. దీనివల్ల ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగుతాయన్నారు. ప్రభుత్వ రంగంలో ఉన్న టీవీచానళ్ల ప్రసారాల ద్వారా ఈ సిగ్నల్స్‌ను అందించవచ్చని, లేదా వాటిని మొబైల్ టెలికం ప్రొవైడర్లకు అమ్ముకోవచ్చని ఆయన సూచించారు.