breaking news
TV Today
-
స్టాక్స్ వ్యూ
ఐటీసీ - బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ - ప్రస్తుత ధర: రూ.329, టార్గెట్ ధర: రూ.394 ఎందుకంటే: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఓ మోస్తరుగా ఉన్నాయి. మొత్తం ఆదాయం 0.6 శాతం వృద్ధితో రూ.9,290 కోట్లకు పెరిగింది. అధిక పన్నుల కారణంగా సిగరెట్ల అమ్మకాల పరిమాణం 10 శాతం తగ్గింది. వ్యవసాయ విభాగపు రాబడులు 29 శాతం తగ్గాయి, కొత్త కంపెనీల చట్టం ప్రకారం అదనపు తరుగుదల వ్యయాల కారణంగా హోటల్ విభాగం రాబడులు కూడా తగ్గాయి. ఎఫ్ఎంసీజీ విభాగపు అమ్మకాలు 11 శాతం వృద్ధిని సాధించాయి. వచ్చే బడ్జెట్లో సిగరెట్లపై ఎక్సైజ్ సుంకం హేతుబద్ధీకరణ జరుగుతుందని కంపెనీ భావిస్తోంది. 2016-17 ఆర్థిక సంవత్సరం నుంచి సిగరెట్ల విభాగం అమ్మకాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నాం. ఎఫ్ఎంసీజీ విభాగపు అమ్మకాలు కూడా దూసుకుపోతుండడం సానుకూలాంశం. 2007-08లో 16 శాతంగా ఉన్న మొత్తం అమ్మకాల్లో ఎఫ్ఎంసీజీ వాటా 2013-14లో 25 శాతానికి పెరిగింది. ఇదే జోరు కొనసాగగలదని అంచనా వేస్తున్నాం. కొత్త కొత్త కేటగిరీల్లోకి ప్రవేశిస్తోంది. ఇటీవలనే సావ్లాన్, షవర్ టు షవర్ బ్రాండ్లను కొనుగోలు చేసింది. ఎస్బీఐ - బ్రోకరేజ్ సంస్థ: రెలిగేర్ సెక్యూరిటీస్ - ప్రస్తుత ధర: రూ.282, టార్గెట్ ధర: రూ.357 ఎందుకంటే: ట్రెజరీ ఆదాయం 314 శాతం పెరగడం, ఆదాయపు పన్ను రీఫండ్‌పై వడ్డీ ఆదాయం అధికంగా ఉండటం, తక్కువ కేటాయింపులు తదితర కారణాల వల్ల గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో నికర లాభం అంచనాలను మించింది. 23 శాతం వృద్ధి(క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 29 శాతం)తో రూ.3,740 కోట్లకు పెరిగింది. గత ఏడాది కాలం నుంచి ఆస్తుల నాణ్యత మెరుగుపడుతూ వస్తోంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో 4.9శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో 4.25 శాతానికి తగ్గాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొండి బకాయిలు మరింతగా తగ్గుతాయని బ్యాంక్ భావిస్తోంది. రుణాలు 8 శాతం, డిపాజిట్లు 13 శాతం చొప్పున పెరిగాయి. మొత్తం మీద ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, ఆస్తుల నాణ్యత, పనితీరుల్లో మంచి వృద్ధినే సాధించింది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడితే ఈ అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ షేర్ జోరు పెరుగుతుంది. టీవీ టుడే - బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డెరైక్ట్ - ప్రస్తుత ధర: రూ.184, టార్గెట్ ధర: రూ.240 ఎందుకంటే: గత ఆర్థిక సంవత్సరం క్యూ4 ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఆదాయం 18 శాతం వృద్ధితో రూ.114 కోట్లకు పెరిగింది. ఢిల్లీ ఎన్నికలు, ఆస్ట్రేలియాలో క్రికెట్ వరల్డ్ కప్ కారణంగా కంపెనీ నిర్వహణ వ్యయాలు పెరిగాయి. పోటీ పెరగడంతో మార్కెటింగ్ వ్యయాలు కూడా పెరిగాయి. దీంతో మొత్తం వ్యయాలు 46 శాతం పెరిగాయి. నికర లాభం రూ.8.7 కోట్లకే పరిమితమైంది. హిందీ వార్తా చానెళ్లలో ఈ సంస్థకు చెందిన ఆజ్ తక్ అగ్రస్థానం గత పదేళ్లుగా కొనసాగుతోంది. రాజ్‌దీప్ సర్దేశాయ్, కరణ్ థాపర్ వంటి హేమాహేమీలు డెరైక్టర్ల బోర్డ్లోకి రావడంతో ఈ సంస్థ ఇంగ్లీస్ న్యూస్ చానెల్, హెడ్‌లైన్స్ టుడే జోరు పెరుగుతోంది. ప్రకటనల ఆదాయం 18 శాతం పెరిగింది. డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తయితే, మరింత మంది చందాదారులకు చానెల్ చేరువవుతుంది. ఆదాయం 7 శాతం వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. రెండేళ్లలో ఇబిటా 26 శాతం, నికర లాభం 30 శాతం చొప్పున పెరుగుతాయని అంచనా. -
టీవీ టుడే ఓయే ఎఫ్ఎం
స్టేషన్ల విక్రయం న్యూఢిల్లీ: టీవీ టుడేకు చెందిన ఏడు ఓయే ఎఫ్ఎం రేడియో స్టేషన్లను ప్రముఖ ఎఫ్ఎం రేడియో సంస్థ, రేడియో మిర్చి కొనుగోలు చేసింది. అయితే ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఇరు కంపెనీలు వెల్లడించలేదు. బెనెట్ కోల్మన్, అండ్ కంపెనీ ప్రమోట్ చేసిన ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్ ఇండియా(ఈఎన్ఐఎల్) రేడియో మిర్చిని నిర్వహిస్తోంది. బెనెట్ కోల్మన్ సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్, నవభారత్ టైమ్స్ వంటి పత్రికలను, టైమ్స్ నౌ, ఈటీ నౌ తదితర టీవీ చానెళ్లను నిర్వహిస్తోంది. ఓయే ఎఫ్ఎం రేడియో స్టేషన్లను ఇండియా టుడే గ్రూప్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఓయే ఎఫ్ఎం స్టేషన్లను ముంబై, ఢిల్లీ, కోల్‌కత, అమృత్సర్, జోధ్‌పూర్, పాటియాల, సిమ్లాల్లో నడుపుతోంది. రేడియో మిర్చి ఎఫ్ఎం రేడియో సర్వీసులు ముంబై, ఢిల్లీ, కోల్‌కత వంటి 32 నగరాల్లో నడుస్తున్నాయి. రేడియో స్టేషన్లను విక్రయించడం ఇండియా టుడే గ్రూప్‌కు ఇది రెండోసారి. 2006లో రెడ్ ఎఫ్ఎం రేడియో స్టేషన్లను ఎన్డీటీవీకి విక్రయించింది.