
టీవీ టుడే ఓయే ఎఫ్‌ఎం
స్టేషన్ల విక్రయం
న్యూఢిల్లీ: టీవీ టుడేకు చెందిన ఏడు ఓయే ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లను ప్రముఖ ఎఫ్‌ఎం రేడియో సంస్థ, రేడియో మిర్చి కొనుగోలు చేసింది. అయితే ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఇరు కంపెనీలు వెల్లడించలేదు. బెనెట్ కోల్‌మన్, అండ్ కంపెనీ ప్రమోట్ చేసిన ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్స్ ఇండియా(ఈఎన్‌ఐఎల్) రేడియో మిర్చిని నిర్వహిస్తోంది. బెనెట్ కోల్‌మన్ సంస్థ టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్, నవభారత్ టైమ్స్ వంటి పత్రికలను, టైమ్స్ నౌ, ఈటీ నౌ తదితర టీవీ చానెళ్లను నిర్వహిస్తోంది.
ఓయే ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లను ఇండియా టుడే గ్రూప్ నిర్వహిస్తోంది. ఈ సంస్థ ఓయే ఎఫ్‌ఎం స్టేషన్లను ముంబై, ఢిల్లీ, కోల్‌కత, అమృత్‌సర్, జోధ్‌పూర్, పాటియాల, సిమ్లాల్లో నడుపుతోంది. రేడియో మిర్చి ఎఫ్‌ఎం రేడియో సర్వీసులు ముంబై, ఢిల్లీ, కోల్‌కత వంటి 32 నగరాల్లో నడుస్తున్నాయి. రేడియో స్టేషన్లను విక్రయించడం ఇండియా టుడే గ్రూప్‌కు ఇది రెండోసారి. 2006లో రెడ్ ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లను ఎన్‌డీటీవీకి విక్రయించింది.