జైలులో..భలే మంచి రోజు
హీరో సుధీర్ బాబు, దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, హాస్య నటుడు వేణులను పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి తోశారు. అయ్యో అంత పని ఏం చేశారు వాళ్లు అనుకుంటున్నారా..? అసలు విషయమేమిటంటే.. అనాథ పిల్లలు న్యూఇయర్ వేడుకలు జరుపుకోవాలనే సదుద్దేశంతో ఎఫ్‌ఎం రేడియో మిర్చి శనివారం కూకట్‌పల్లిలోని మంజీరా మాల్‌లో ‘ఫండ్ రైజింగ్’ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన జైలు లాంటి సెట్‌లో ఆర్‌జే సమీర్ బందీ అయ్యారు.
సదుద్దేశంతో అతను చేసిన ఈ సత్కార్యానికి తమ వంతు సహకారమందించాలని ‘భలే మంచి రోజు’ చిత్ర బృందం భావించింది. అందుకే సుధీర్‌బాబు, శ్రీరామ్ ఆదిత్య, వేణు మంజీరా మాల్‌కు వచ్చారు. జైలు లాంటి ఆ సెట్‌లో తమను తాము బంధించుకున్నారు. అనాథ పిల్లలకు అవసరమయ్యే ఫండ్ సమకూరే వరకూ బందీలుగానే ఉన్నారు. ‘ఇలాంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించి, మానవత్వాన్ని చాటుకోవాల’ని సుధీర్‌బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్‌జే హేమంత్, ప్రోగ్రామింగ్ హెడ్ సాయి తదితరులు పాల్గొన్నారు.