వైఎస్ జగన్తో ఏపీ ఇరిగేషన్ ఇంజనీర్ల భేటీ
హైదరాబాద్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఇంజనీర్లు సమావేశమయ్యారు. సోమవారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ ను కలుసుకొని, తమ సమస్యలు తెలియజేశారు.
రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తమకు పోస్టింగులు ఇవ్వకుండా తమ జీవితాలతో ఆడుకుంటున్నాయని ఇంజనీర్లు వైఎస్ జగన్ దృష్టికి తీసుకువచ్చారు. మూడు నెలలుగా తమకు జీతాలు కూడా ఇవ్వటం లేదని వారు వాపోయారు. తమకు ఏ రాష్ట్రంలో పోస్టింగులు ఇచ్చినా చేయటానికి సిద్ధంగా ఉన్నామని ఇంజనీర్లు చెప్పారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పట్టించుకోవడం లేదని, ఈ విషయంలో సాయం చేయాల్సిందిగా జగన్ ను కోరారు. అనంతరం ఇంజనీర్లు మీడియాతో మాట్లాడుతూ.. తమ సమస్యలపై జగన్ సానుకూలంగా స్పందించారని, ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారని తెలిపారు.