భారతీయులకు మెగసెసె
మనీలా: ఆసియన్ నోబెల్‌గా పేరుగాంచిన రామన్ మెగసెసె అవార్డుకు ఈ ఏడాది ఇద్దరు భారతీయులు ఎంపికయ్యారు. వీధుల్లో మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న వ్యక్తులకు ఉచిత చికిత్స అందిస్తున్న మానసికవైద్యుడు భరత్ వాత్వానీతో పాటు లడఖ్ యువత జీవితాల్లో వెలుగునింపిన ఇంజనీర్ సోనమ్ వాంగ్‌చుక్‌లను ఈ అవార్డు వరించింది. ముంబైకి చెందిన వాత్వానీ.. వీధుల్లో తిరుగుతున్న మతిస్థిమితం లేనివారికి ఆహారం, ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఉచిత చికిత్సను అందిస్తున్నారనీ మెగసెసె ఫౌండేషన్ ప్రశంసించింది.
1988లో శ్రద్ధ రిహాబిలిటేషన్ ఫౌండేషన్‌ను స్థాపించి వాత్వానీ దంపతులు ఎనలేని సేవచేస్తున్నారు. ‘త్రీ ఇడియట్స్’ సినిమాలో ఆమిర్ ఖాన్ పాత్రకు స్ఫూర్తిగా నిలిచిన ఇంజనీర్ వాంగ్ చుక్.. తన విభిన్నమైన, సృజనాత్మక బోధనా పద్ధతులతో ఈశాన్య భారతం,లడఖ్ యువత జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నారని ఫౌండేషన్ కితాబిచ్చింది. వీరిద్దరితో పాటు కంబోడియాకు చెందిన యూక్ ఛాంగ్, తూర్పు తైమూర్‌కు చెందిన మరియా డీ లౌర్డెస్, ఫిలిప్పీన్స్‌కు చెందిన హోవర్డ్ డీ, వియత్నాంకు చెందిన హోథి హోంగ్ యన్లు అవార్డుకు ఎంపికయ్యారు. విజేతలకు ప్రశంసా పత్రంతో పాటు మెగసెసె ముఖాకృతి ఉన్న మెడల్, రూ.20.6 లక్షల నగదు బహుమతి ప్రదానంచేయనున్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని నగరం మనీలాలో ఉన్న సాంస్కృతిక కేంద్రంలో ఆగస్టు 10న ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు.