రెండు ఆస్కార్లు చేతబట్టిన నిగర్వి ఆయన...
భారతీయ సంగీత పరిశ్రమ ప్రస్తావన వస్తే రెహమాన్ పేరు తప్పక వినిపిస్తుంది. భారతీయ సంగీతం.. ఆ మాటకొస్తే ప్రపంచ సంగీతంపై ఆయన వేసిన ముద్ర అలాంటిలాంటిది కాదు. దాదాపు పాతికేళ్లుగా ఆయన సృష్టించని సరికొత్త సంగీత ఒరవడి లేదు. ఆయన పాటలు విని మైమరిచిపోని శ్రోతలు లేరు. ఆయన అందుకోని అవార్డులు, సాధించని ఘనతలూ ఏమీ మిగిలి లేవు. రెండు ఆస్కార్లు చేతబట్టి భారతీయుల్ని తలెత్తుకునేలా చేసినా.. కించిత్ గర్వాన్ని కూడా తలకెక్కించుకోనివ్వని నిగర్వి రెహమాన్..!
బాల్యం..
రెహమాన్ పూర్తిపేరు అల్లా రఖా రెహమాన్. అసలు పేరు ఎ.ఎస్.దిలీప్ కుమార్. 1967 జనవరి 6 ఆయన పుట్టినరోజు. చెన్నైలోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. రెహమాన్ తండ్రి ఆర్.కె.శేఖర్ మలయాళ చిత్రాలకు సంగీత దర్శకుడిగా పనిచేసేవారు. అయితే, ఆయన ఆకస్మిక మరణం రెహమాన్‌ను కుటుంబ బాధ్యతలు తీసుకునేలా చేసింది. తండ్రి సంపాదించి పెట్టిన కీబోర్డులను అద్దెకు ఇస్తూ తొమ్మిదేళ్ల రెహమాన్ తల్లితో పాటు కుటుంబాన్ని ముందుకు నడిపించాడు. పదకొండేళ్ల వయసులో కీబోర్డు, గిటార్ ప్లేయర్‌గా ఇళయరాజా ట్రూపులో చేరాడు. అలా బాల్యంలోనే సంగీతాభిరుచిని అలవరచుకున్నాడు.
సంగీత ప్రస్థానం..
రాజ్-కోటి లాంటి సంగీత దర్శకుల వద్ద అసిస్టెంటుగా చేరి సినీ సంగీత ప్రయాణాన్ని ప్రారంభించాడు. కెరీర్ ఆరంభంలో వాణిజ్య ప్రకటనలకు జింగిల్స్ సమకూర్చేవాడు. తర్వాతి కాలంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన ‘యోధ’ సినిమాతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యాడు. అయితే, అంతకుముందే మణిరత్నం సినిమా ‘రోజా’ (1992) చిత్రం విడుదల కావడంతో దేశవ్యాప్తంగా రెహమాన్ పేరు మార్మోగింది. ఆ చిత్రానికి గానూ తొలి చిత్రానికే జాతీయ అవార్డు అందుకున్న ఘనతను సాధించాడు. నాటి నుంచీ నేటివరకూ ఎన్నో సూపర్‌హిట్ సినిమాలకు పనిచేశాడు. భారతీయ అగ్రగామి స్వరకర్తగా పేరు గడించాడు. ఆయన సంగీతమందించిన చిత్రాలు కొన్ని విఫలమైనా.. రెహమాన్ మాత్రం ఏనాడూ సంగీత దర్శకుడిగా విఫలం కాలేదు.
ఆస్కార్..
ఎన్నో అద్భుతమైన పాటలు రెహమాన్ సృష్టించినా.. స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి లభించిన గౌరవం మాత్రం మరే చిత్రానికీ దక్కలేదు. 2009లో విడుదలైన ఈ చిత్రం రెహమాన్‌కు అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది. ఈ చిత్రానికి గానూ బెస్ట్ ఒరిజినల్ సాంగ్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో రెండు ఆస్కార్లు సాధించాడు. దీంతో ప్రపంచం దృష్టి ఒక్కసారిగా ఈ భారతీయ సంగీత సంచలనంపై పడింది. ఇదే చిత్రానికి ప్రఖ్యాత గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు బాఫ్టా అవార్డు సైతం సొంతం చేసుకున్నాడు.
గౌరవాలు..
టైమ్ మ్యాగజైన్ రెహమాన్‌కు ‘మొజార్ట్ ఆఫ్ మద్రాస్’ బిరుదు ఇచ్చింది. జాతీయ స్థాయిలో నాలుగుసార్లు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు అందుకున్నాడు. హిందీ, తమిళ చిత్రాలకు 19 సార్లు ఫిలింఫేర్ అవార్డులు, తమిళనాడు ప్రభుత్వ అవార్డులు గెలుచుకున్నాడు. బర్ల్కీ సంగీత కళాశాల సహా పలు విశ్వవిద్యాలయాలు ఆయనకు గౌరవ డాక్టరేట్లు ప్రధానం చేశాయి. 2012 క్రిస్మస్ వేడుకలకు అమెరికా అధ్యక్షుడి నుంచి రెహమాన్‌కు ఆహ్వానం అందింది. వైట్‌హౌస్‌లో డిన్నర్‌కు కూడా పిలుపు వచ్చింది. కెనడాలోని ఒంటారియో రాష్ట్రం మర్ఖామ్ నగరంలో రెహమాన్ పేరిట ఓ వీధిని సైతం ఏర్పాటు చేశారు.
కుటుంబం..
రెహమాన్ దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో అమీన్, ఖతీజాలు ఇప్పటికే సినిమాలకు తమ గాత్రాన్ని దానం చేశారు. రహీమా సైతం అదే పనిలో ఉంది. ఇక, ప్రముఖ యువ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ రెహమాన్‌కు స్వయానా మేనల్లుడు. ఆయన సోదరి ఎ.ఆర్.రెహానా ఇప్పటికే అనేక సినిమాలకు సంగీత దర్శకురాలిగా, గాయనిగా పనిచేశారు.