బ్యాంకులో వృద్ధుడి నుంచి రూ.49వేలు చోరీ
కొయ్యలగూడెం : పాతనోట్లు మార్చుకునేందుకు కన్నాపురం ఆంధ్రాబ్యాంకుకు వచ్చిన ఒక వృద్ధుడి నుంచి ఇద్దరు యువకులు రూ.49వేలు దొంగిలించి పరారైన ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. బుట్టాయగూడెం మండలం కోట రామచంద్రపురానికి చెందిన బర్రె విజయరాజు కొద్దినెలల కిందట పొలం అమ్మగా సుమారు రూ.3.50 లక్షలు వచ్చాయి. ఇందులో అప్పులు తీర్చగా పోను రూ.49వేలను దాచుకున్నాడు. ప్రస్తుతం పెద్దనోట్లను రద్దు చేయడంతో వాటిని బ్యాంకులో డిపాజిట్ చేయడానికి భార్య భద్రమ్మతోపాటు వచ్చాడు. క్యూలో నిలుచుని ఉన్న విజయరాజును మంచినీరు పోయాల్సిందిగా ఇద్దరు యువకులు కోరారు. దీంతో ఆయన పక్కనే ఉన్న వాటర్టిన్ను గ్లాసులోకి వంచుతుండగా, ఇద్దరూ విజయరాజు పైజేబులో ఉన్న సొమ్మును లాక్కుని పరారయ్యారు. విజయరాజు వృద్ధుడు కావడంతో వారిని వెంబడించలేకపోయాడు. బ్రాంచి మేనేజర్ సూచన మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు.