50 ఏళ్ల కలలపై నీళ్లు చల్లొద్దు!
కాంగ్రెస్, టీడీపీలు అభివృద్ధి వ్యతిరేకులు
పారదర్శకంగా జిల్లాల పునర్ఃవిభజన
రాష్ర్ట భారీ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట జోన్: ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని, పరిపాలన సౌలభ్యం కోసమే పారదర్శకంగా జిల్లాల పునర్విభజన ప్రక్రియ చేపడుతున్నట్టు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. పునర్విభజన ప్రక్రియపై కాంగ్రెస్, టీడీపీలు కుట్ర పన్నుతున్నాయని ఆయన ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన సిద్దిపేటలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్, టీడీపీ అభివృద్ధి నిరోధక పార్టీలుగా అభివర్ణించారు. ఇదే ప్రక్రియను కొనసాగిస్తే ఆ రెండు పార్టీల నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్యశ్యామం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంటే.. అడ్డుకునేందుకు కోర్టుకు, నల్ల జెండాలతో భూసేకరణ ప్రక్రియను అడ్డుకున్నారని ఆరోపించారు.
ప్రభుత్వానికి మంచిపేరు వస్తే తమకు భవిష్యత్తు ఉండదన్న సందేహంలో వారంతా ఉన్నారన్నారు. 50 ఏళ్లుగా ఆయా ప్రాంతాల ప్రజలు కన్నకలలను సీఎం కేసీఆర్ నేడు అమలుచేసే దిశగా ముందుకు నడుస్తున్నారని చెప్పారు. రాష్ర్ట ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన కమిటీలను ఏర్పాటు చేసి కలెక్టర్ల ద్వారా సమగ్ర నివేదికను రూపొందిస్తున్నామన్నారు.
అఖిలపక్షంతో సమావేశం నిర్వహించి, డ్రాప్ట్ నోటిఫికేషన్ జారీ చేసి సలహాలు, సూచనలు, అభ్యంతరాల కోసం 30 రోజుల గడువు కూడా ప్రకటించామన్నారు. జగిత్యాల, వనపర్తిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నా అక్కడ కూడా జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని, రాజకీయ ఉద్దేశం ఉంటే ఇదంతా జరిగేదా అని ప్రశ్నించారు. అదే విధంగా తమ పార్టీకి చెందిన మంత్రి, ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లా, జనగామలో జిల్లా ప్రకటన లేకపోవడం ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమన్నారు.
ఉత్తమ్.. సిద్దిపేటలో మాట్లాడు..
‘మెదక్ జిల్లాలో మూడు జిల్లాలు అవసరమా?’ అని ప్రశ్నించిన రాష్ర్ట టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి దమ్ముంటే అదే మాటను సిద్దిపేట పాత బస్టాండ్ వద్దకు వచ్చి మాట్లాడాలని హరీశ్‌రావు సవాల్ విసిరారు. సిద్దిపేటకు వ్యతిరేకంగా ఒక్క ప్రకటన చేసినా సహించేది లేదన్నారు. జిల్లాల పునర్విభజనపై మాట్లాడే నైతిక హక్కు ఉత్తమ్‌కుమార్ లేదని స్పష్టం చేశారు.
మహారాష్ర్ట ఒప్పందంపై రాద్దంతం, ప్రాజెక్ట్‌ల భూసేకర అడ్డుకోవడం, జిల్లాల పునర్విభజనపై కోర్టును ఆశ్రయిస్తామనడాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. వారే సరైన గుణపాఠం చెబుతారని చెప్పారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ.. ఒకే నిర్ణయం ప్రకటించే ధైర్యముందా? అని మంత్రి ప్రశ్నించారు.
సొంత పార్టీలో ఐక్యత రాగం లేని కాంగ్రెస్.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం అర్ధరహితమన్నారు. ప్రతిపక్షాలు మంచి సూచనలు ఇస్తే అంగీకరస్తామని.. అందుకు వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్ది సూచన మేరకు మార్కెట్ కమిటీల్లో ప్రభుత్వ రిజర్వేషన్లు అమలు చేసిందని గుర్తుచేశారు. సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు సోమిరెడ్డి పాల్గొన్నారు.