దామరపల్లిలో టీడీపీ వర్గీయుల దాడి
- వినాయక ఊరేగింపులో అధికారపార్టీ దౌర్జన్యం
- ఐదుగురు వైసీపీ కార్యకర్తలకు గాయాలు
దామరపల్లి (తాడికొండ): రెండు సామాజికవర్గాలు వినాయక ఉత్సవాల్లో పైచేయి సాధించేందుకు పరస్పరం దూషణలకు దిగాయి. సర్ది చెబుతామని వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై టీడీపీ వర్గీయులు దాడికి దిగిన సంఘటన దామరపల్లి గ్రామంలో ఆదివారం చోటుచేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం.. దామరపల్లిలో ఒక ప్రధాన సామాజిక వర్గం టీడీపీకి చెందినది. 30ఏళ్లుగా మిగిలిన సామాజికవర్గాలు ఒకటిగా ఉంటుండడంతో ఆ ప్రధాన సామాజికవర్గం ఏ ఎన్నికల్లోనూ విజయం సాధించలేదు.
దామరపల్లి ఎంపీటీసీ సెగ్మెంటు పరిధిలో ఫణిదరం, గరికపాడు గ్రామాలు కలిసివుంటాయి. ఇటీవల జరిగిన మండల పరిషత్, సాధారణఎన్నికల్లో వైఎస్సార్ సీపీదే పైచేయి అ య్యింది. అప్పటినుంచి అధికార టీడీపీ అదను కోసం ఎదురుచూస్తోంది. ఎన్నికల్లో ఎస్సీలు తమ పార్టీకి ఓట్లు వేయలేదని గెలిచాక ప్రతీకారం తీర్చుకునేందుకు వేచి వుంది. ఈ నేపథ్యంలోగ్రామంలోని రెండు సామాజికవర్గాలకు చెందిన వ్యక్తులు వినాయకుడి ఊరేగింపు ఆదివారం ఉదయం నుంచే ప్రారంభించారు. మధ్యాహ్నానికి రెండు వర్గాల మధ్య స్వల్పవివాదం నెలకొనగా.. మొదటగా స్థానిక వైఎస్సార్ సీపీకి చెందిన ఎంపీటీసీ అల్లూరి సీత సోదరుడైన పెరుమాళ్ళ శ్రీనివాసరావు ఇరువర్గాలను నచ్చజెప్పి సముదాయించాడు.
ఓ ప్రధాన సామాజికవర్గానికి చెందిన టీడీపీ వర్గీయులు గతంలో ఓట్లు వేయని మీరు చెప్పేదేంటని దుర్భాషలాడుతూ 20మంది వ్యక్తులు వెంట పడి శ్రీనివాసరావును బురదకాలువలో తొక్కి తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో ఐదుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. సమాచార మందుకున్న పోలీసులు వినాయకుడి విగ్రహాలను తరలింపజేసి.. గొడవ సద్దుమణిగేందుకు ప్రయత్నించారు. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేసి పికెట్ ఏర్పాటుచేశారు. రెండు వర్గాలు రాజీకి వచ్చి గ్రామంలో శాంతిభద్రతలకు విఘా తం కలగకుండా చూస్తామని పోలీసులకు తెలిపాయి.