ప్రాణం తీసిన సరదా
ఈత నేర్చుకోవాలన్న సరదా ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది. ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు... బత్తలపల్లి మండలం జలాలపురం గ్రామానికి చెందిన కుమ్మర రామకృష్ణ, సుగుణమ్మ దంపతుల కుమారుడు కుమ్మర సాయికుమార్(13) బత్తలపల్లిలో 8వ తరగతి పూర్తి చేశాడు. ఎరికల గోవిందు, రమణమ్మ దంపతుల కుమారుడు ఎరికల జస్వంత్(7) రెండో తరగతి పూర్తి చేశాడు. తోటి పిల్లలు వెంకటేష్, విజయ్, శివశంకర్, మురళితో కలిసి వీరు మంగళవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో సమీపంలోని దోశలకుంట చెరువులో ఈత కోసం బయల్దేరారు. అయితే వీరిని కుమ్మర గొర్ల పోతలయ్య అనే వ్యక్తి గమనించి చివాట్లు పెట్టి వెనక్కు పంపించారు. వీరంతా మరో మార్గం ద్వారా చెరువు వద్దకు చేరుకున్నారు.
సోమవారం రాత్రి భారీ వర్షానికి చెరువులోకి వర్షం నీరు చేరి గుంతలన్నీ నిండాయి. చెరువు కట్ట నుంచి నీటిలోకి దిగే సమయంలో సాయికుమార్ కాలు జారి గుంతలోకి పడిపోతూ అరవడంతో.. అతడిని రక్షించడానికి వెళ్లిన జస్వంత్ కూడా మునిగిపోయాడు. మిగతా నలుగురు పిల్లలు భయపడి ఊరిలోకి వెళ్లి విషయం తెలపడంతో గ్రామస్తులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే సాయికుమార్, జస్వంత్లు నీటిలో ఊపిరాడక ప్రాణాలు విడిచారు. దీంతో రెండు కుటుంబాల్లోనూ విషాదఛాయలు అలుముకున్నాయి.