'ఇప్పుడే ఆరంభమైంది.. భయంకరంగా ఉంటుంది'
బ్రస్సెల్స్: బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో ఆత్మాహుతి దాడులకు తమదే బాధ్యతని ప్రకటించిన ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించింది. మీకు పీడకల ఇప్పుడే ఆరంభమైందని బెల్జియం వాసులను బెదిరిస్తూ ఐఎస్ రెండు వీడియోలను విడుదల చేసినట్టు బెల్జియం రేడియో ఆర్టీబీఎఫ్ వెల్లడించింది.
ఐఎస్ ఉగ్రవాదులు ఈ వీడియోలను బెల్జియం వార్తా పత్రిక లి సొయిర్కు పంపారు. సిరియా, ఇరాక్లలో పాశ్చాత్య దేశాలు తమ బలగాలను ఉపసంహరించుకోవాలని, లేకుంటే మరిన్ని దాడులు చేస్తామని హెచ్చరించారు. 'సిరియా, ఇరాక్లలో విమానాలను, సైనికులను ఉపసంహరించుకోమని చెప్పండి. మీరు ప్రశాంతంగా జీవిస్తారు. పీడకల ఇప్పుడే ఆరంభమైంది. తర్వాత జరిగే దాడి చాలా భయానకంగా ఉంటుంది. ఏడాది క్రితం మేం చేసిన హెచ్చరికను గుర్తుతెచ్చుకోండి. పారిస్, బ్రస్సెల్స్లపై దాడి చేస్తామని చెప్పాం. చెప్పినట్టే చేశాం. మాకు మరిన్ని లక్ష్యాలున్నాయి' అని వీడియోలో ఐఎస్ ఉగ్రవాది హెచ్చరించాడు.
మంగళవారం బ్రస్సెల్స్లోని విమానాశ్రయం లోపల, సమీపంలోని మెట్రో స్టేషన్ వద్ద ఉగ్రవాదులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 30 మందికి పైగా మరణించగా, మరో 200 మంది గాయపడ్డారు.