40 నిమిషాలు గుండె, మెదడును ఆపేసి..
కొచ్చి: గుండె, మెదడును ఆపేసి మరి ఓ బాలుడికి విజయవంతంగా కేరళ వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు. అతడి గుండెలోపల నుంచి వెలుపల వరకు పెరిగిన కణితిని తొలగించారు. ఇందుకోసం ఆ బాలుడి శరీర ఉష్ణోగ్రతను 15 డిగ్రీలు తగ్గించారు. డీప్ హైపోథెర్మిక్ సర్క్యూలేటరీ అరెస్ట్(డీహెచ్సీఏ) అనే పద్ధతి ద్వారా రెండేళ్ల బాలుడికి దాదాపు తొమ్మిది గంటలపాటు శ్రమించి ఈ వైద్యం చేసినట్లు వైద్యులు తెలిపారు.
ఆది తోపిల్ ఫబీర్ అనే రెండేళ్ల బాలుడి హృదయంలోపల క్యాన్సర్ వ్రణం పెరిగింది. సాధారణంగా లోపలో బయటో పెరిగే ఈ కణితి కాస్త ఈ బాలుడికి గుండె లోపలి నుంచి బయటవరకు పెరిగింది. 200 గ్రాముల సైజులో అది పెద్దదైంది. దీంతో అత్యంత అరుదైన పద్ధతిలో ఆ బాలుడికి శస్త్ర చికిత్స నిర్వహించారు. మొత్తం 30 మంది వైద్యులు ఈ ఆపరేషన్ లో పాలుపంచుకున్నారు.
ఇందుకోసం 40 నిమిషాలపాటు అతడి గుండెను, మెదడును ఆపేయడంతోపాటు సాధారణంగా ఒక వ్యక్తిలో ఉండాల్సిన ఉష్ణోగ్రత 37 డిగ్రీలుకాగా దానిని 22 డిగ్రీలకు తగ్గించారు. అంటే 15 డిగ్రీలు కొంత సమయంపాటు తగ్గించారన్నమాట. వైద్య పరిభాషలో ఇది క్లినికల్ డెత్ లాంటిది. ఇది ప్రపంచంలో విజయవంతమైన ఐదో శస్త్రచికిత్స అని ఎంకే మోస్సా కుని అనే వైద్యుడు తెలిపారు. మిగితా నాలుగు కేసుల్లో మాత్రం గుండె లోపల కణితిని తొలగించారని, తాము చేసింది అరుదైన శస్త్ర చికిత్స అని అన్నారు. ఈద్ రోజున శస్త్ర చికిత్స నిర్వహించామని ప్రస్తుతం ఆ బాలుడు క్షేమంగా ఉన్నాడని వివరించారు.