ఈవెంట్
‘మాటల పుట్టుపూర్వోత్తరాలు’ ప్రసంగం
వంశీ విజ్ఞానపీఠం- శ్రీ త్యాగరాయ గానసభ ఆధ్వర్యంలో డిసెంబర్ 22న సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గానసభలో ‘మాటల పుట్టుపూర్వోత్తరాలు’ అంశంపై ద్వా.నా.శాస్త్రి ప్రసంగిస్తారు. ఇందులో, జె.చెన్నయ్య, రెంటాల జయదేవ, వంశీ రామరాజు, కళావేంకట దీక్షితులు, తెన్నేటి సుధాదేవి పాల్గొంటారు.
‘వేదన’ ఆవిష్కరణ సభ
ధ్వని ప్రచురణలు ఆధ్వర్యంలో డిసెంబర్ 24న ఉదయం 10 గంటలకు జలజం సత్యనారాయణ హిందీ అనువాద కావ్యం ‘వేదన’(మూలం: జయశంకర్ ప్రసాద్) ఆవిష్కరణ జిల్లా కో ఆపరేటివ్ బ్యాంక్ ఆడిటోరియం, మహబూబ్‌నగర్‌లో జరగనుంది. ఆవిష్కర్త: ఎన్.గోపి. జూలూరు గౌరీశంకర్, వి.శ్రీనివాస్‌గౌడ్, బి.నరసింగరావు, మోహన్ సింగ్, వేణు సంకోజు, గూడూరు మనోజ, ఎస్.రఘు పాల్గొంటారు.
తెలంగాణ కథ-2014 ఆవిష్కరణ
సింగిడి తెలంగాణ రచయితల సంఘం ఆధ్వర్యంలో ‘తన్లాట: తెలంగాణ కథ-2014’ ఆవిష్కరణ డిసెంబర్ 25న సాయంత్రం 4:30కు హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో జరగనుంది. అధ్యక్షత: సంగిశెట్టి శ్రీనివాస్. ఆవిష్కర్త: కె.రామచంద్రమూర్తి. అతిథులు: జూపాక సుభద్ర, అనిశెట్టి రజిత.
‘ఆదివాసీలు చెప్పిన కథలు’ ఆవిష్కరణ
సామాన్య రచన ‘టీ తోటల ఆదివాసీలు చెప్పిన కథలు’ ఆవిష్కరణ డిసెంబర్ 26న సాయంత్రం 5 గంటలకు తెలంగాణ కళాభారతి(ఎన్టీఆర్ స్టేడియం)లో జరుగుతోన్న హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో జరగనుంది. ఆవిష్కర్త: సుబోధ్ సర్కార్. కాకి మాధవరావు, బి.వినోద్‌కుమార్, జయధీర్ తిరుమలరావు పాల్గొంటారు.
బరవే- ఉత్తరాంధ్ర సదస్సు
బహుజన రచయితల వేదిక- ఉత్తరాంధ్ర జిల్లాల వార్షిక సదస్సు డిసెంబర్ 26న విశాఖపట్నంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించనున్నారు. బహుజనుల ఆహారం- భావ ప్రకటన- మత ఫాసిజంపై సదస్సు; నారింజరంగు సాయంత్రాలు(బండి సత్యనారాయణ), ఉద్దానం(బల్లెడ నారాయణమూర్తి), కులాన్ని నిర్మూలిద్దాం, నవ భారతాన్ని నిర్మిద్దాం(టి.శ్యామ్‌షా), దాచబడ్డ చరిత్ర(బర్రె ఆనందకుమార్) పుస్తకావిష్కరణ లుంటాయి. నూకతోటి రవికుమార్, పి.సుబ్బారావు, అరుణ గోగులమండ, రమేష్, శ్రీమన్నారాయణ, దుప్పల రవికుమార్, కొల్లాబత్తుల సత్యం ప్రసంగిస్తారు.
ప్రతిభాభినందన సంబరాలు
‘భువన్ కల్చరల్ ఆర్గనైజేషన్’ ఆధ్వర్యంలో డిసెంబర్ 26న సాయంత్రం 5 గంటలకు అనకాపల్లిలోని కొణతాల సుబ్రహ్మణ్యం కళావేదికలో ‘మళ్ల జగన్నాథం, నూకాలతల్లి స్మారక ప్రతిభా పురస్కారాల’ ప్రదానం జరగనుంది. ఇంకా, ‘తెలుగు కథనం’ పుస్తకావిష్కరణ; సరసి, లేపాక్షి, బాచి, వర్చస్వి కార్టూన్ల ప్రదర్శన కూడా ఉంటాయి.
గోరటికి మువ్వా పురస్కారం
శ్రీ మువ్వా పద్మావతి- రంగయ్య ఫౌండేషన్ డిసెంబర్ 27న సాయంత్రం 5 గంటలకు గోరటి వెంకన్నకు జీవనసాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేయనుందని మువ్వా(క్రాంతి) శ్రీనివాసరావు తెలియజేస్తున్నారు. ఖమ్మం, భక్తరామదాసు కళాక్షేత్రంలో జరిగే ఈ సభలోనే కె.శ్రీనివాస్ పరిశోధనాగ్రంథం ‘తెలంగాణ సాహిత్య వికాసం, ఆధునికత వైపు సొంత అడుగులు: 1900-1940’; అరుణ్‌సాగర్ కవిత్వ సంకలనం ‘మ్యూజిక్ డైస్’ ఆవిష్కరిస్తారు. అధ్యక్షత: సీతారాం. విశిష్ట అతిథులు: తుమ్మల నాగేశ్వరరావు, పరుచూరి బ్రదర్స్, అల్లం నారాయణ, ఘంటా చక్రపాణి, మువ్వా విజయ్‌బాబు, తెలకపల్లి రవి.
కొలకలూరి పురస్కారాల కోసం...
ఎనిమిదేళ్లుగా ఇస్తున్న ‘శ్రీమతి కొలకలూరి భాగీరథీ’ ‘శ్రీమతి కొలకలూరి విశ్రాంతమ్మ’ పురస్కారాలను 2016 సంవత్సరానికిగానూ వరుసగా ‘సాహిత్య విమర్శనం’, ‘పరిశోధన’ ప్రక్రియల్లో ఇవ్వనున్నారు. దీనికిగానూ 2013-15 వరకు ముద్రితమైన పుస్తకాలను, విమర్శనమైతే- ‘ఆచార్య కొలకలూరి మధుజ్యోతి, ఆంధ్రాచార్యులు, తెలుగు శాఖ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి-517502’కీ, పరిశోధనైతే- ‘డాక్టర్ కొలకలూరి సుమకిరణ్, అసోసియేట్ ప్రొఫెసర్, ఆంగ్లశాఖ, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి’కీ జనవరి 8లోగా మూడు ప్రతులను పంపాలి. ఫిబ్రవరి 15న పురస్కార ప్రకటన, ఫిబ్రవరి 26న పురస్కార ప్రదానం హైదరాబాద్‌లో ఉంటాయి. మధుజ్యోతి ఫోన్: 9441923172; సుమకిరణ్ ఫోన్: 9963564664.
కథానిక-కదంబం-2016 కోసం...
వేదగిరి రాంబాబు సంపాదకత్వంలో రానున్న డెరైక్టు కథా సంకలనానికి పత్రికలలో ప్రచురించని కథలను జనవరి 31లోగా కథకులు పంపాలనీ, తగిన పారితోషికం ఉంటుందనీ, సమన్వయకర్త ధర్మపురి మధుసూదన్ కోరుతున్నారు. చిరునామా: డాక్టర్ ధర్మపురి మధుసూదన్, ఫ్లాట్ నం.502, దివ్యాక్లాసిక్, కల్యాణ్‌నగర్, ఫేజ్-3, హైదరాబాద్-18; ఫోన్: 040-40173169