తైక్వాండోలో పీబీ సిద్ధార్థ విద్యార్థికి రజత పతకం
విజయవాడ స్పోర్ట్స్ : మానస సరోవర్లో ఈ నెల 22 నుంచి 25వ తేదీ వరకూ జరిగిన మూడో స్టూడెంట్స్ జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ మీట్లో తైక్వాండోలో పీబీ సిద్ధార్థ విద్యార్థి ఎం.వెంకటసాయి రజత పతకం సాధించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీఎన్ పద్మారావు తెలిపారు. 22 ఏళ్ల కేటగిరీలో వెంకటసాయి రజత పతకం సాధించినట్లు చెప్పారు. సీనియర్ తైక్వాండో కోచ్ ఎం.అంకమ్మరావు వద్ద వెంకటసాయి శిక్షణ పొందుతున్నాడు. జాతీయ స్థాయిలో పతకం సాధించిన వెంకటసాయిని పీబీ సిద్ధార్థ కళాశాల యాజమాన్యం, ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మారావు, పీడీ డాక్టర్ ఎన్.శ్రీనివాస్ అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.