తెలుగు టైటాన్స్‌కు తొలి ఓటమి
యు ముంబా ‘సిక్సర్’
ప్రొ కబడ్డీ లీగ్-2
జైపూర్: రెండూ అజేయ జట్లే... పోరు కూడా అదే రీతిన సాగింది.. చివరి సెకను వరకు నువ్వా, నేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో చివరకు యు ముంబా జట్టు ఒక్క పాయింట్ తేడాతో గట్టెక్కింది. ప్రొ కబడ్డీ లీగ్ రెండో సీజన్లో ఆదివారం తెలుగు టైటాన్స్ జట్టు తన సంచలన ఆటతీరును తుది వరకు కొనసాగించినా 26-27 తేడాతో ఓడిపోయింది. యు ముంబాకు ఇది వరుసగా ఆరో విజయం కాగా టైటాన్స్‌కు నాలుగు మ్యాచ్‌ల్లో ఇది తొలి ఓటమి. ఇరు జట్లు రెండు సార్లు ఆలౌట్ అయ్యాయి. ముంబా 14 రైడింగ్ పాయింట్లు సాధించింది. టైటాన్స్ నుంచి సుకేశ్ హెగ్డే 7 రైడింగ్ పాయింట్లు సాధించగా, స్టార్ రైడర్ రాహుల్ చౌదరి 8 సార్లు రైడింగ్ వెళ్లినా ఒక్క పాయింట్ కూడా సాధించలేదు. ముంబా నుంచి కెప్టెన్ అనూప్ కుమార్ సూపర్ షోతో 10 పాయింట్లు సాధించి జట్టు ఉత్కంఠ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి తొలి అర్ధ భాగం వరకు 17-11తో టైటాన్స్ స్పష్టమైన ఆధిక్యాన్ని చూపెట్టింది.
చివర్లోనూ 20-14తో జోరు మీదున్నా మరో ఐదు నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుందనగా ముంబా ఆటగాళ్లు మాయ చేశారు. ముఖ్యంగా అనూప్‌ను కట్టడి చేయడంలో టైటాన్స్ విఫలమైంది. దీనికి తోడు తను రెండు సార్లు రివ్యూకు వెళ్లి సఫలం కావడంతో 27-25తో ముంబా ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి అర నిమిషంలో టైటాన్స్ పాయింట్ సాధించినా ఫలితం లేకపోయింది.జైపూర్‌కు హ్యాట్రిక్ ఓటమి: పట్నా పైరేట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్ 23-29తో హ్యాట్రిక్ పరాజయాన్ని ఎదుర్కొంది. సోమవారం జరిగే మ్యాచ్‌ల్లో ఢిల్లీ దబాంగ్‌తో బెంగళూరు బుల్స్; జైపూర్ పింక్ పాంథర్స్‌తో తెలుగు టైటాన్స్ తలపడతాయి.