యూటర్న్ అంకుల్ చంద్రబాబుకు విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: హోదా వద్దు ప్యాకేజీ అని.. మళ్లీ ప్యాకేజీ వద్దు హోదా అని పూటకో మాట, రోజుకో పాట పాడుతోన్న చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాటల పంచ్‌లు విసిరారు. చంద్రబాబు యూటర్న్ అంకుల్అని, ఇకనైనా ఏదోఒక స్టాండ్‌పై నిలబడటం నేర్చుకోవాలని అన్నారు. బుధవారం పార్లమెంట్ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
‘‘యూటర్న్ అంకుల్ చంద్రబాబు నిన్న అఖిలపక్షం నిర్వహించారు. అదికాస్తా విఫలపక్ష సమావేశమైంది. నాలుగేళ్లుగా రోజుకో మాట చెబుతున్న ఆయనను ఏ ఒక్కరూ నమ్మడంలేదు. నిన్నటి సమావేశంతో ఆయన ఏమీ సాధించలేకపోయారు. ప్యాకేజీలో డబ్బులు సంపాదించుకోవాలనుకున్నారు. తీరా అది కూడా దక్కకపోవడంతో మళ్లీ హోదా కావాలంటున్నారు. మీడియా సాక్షిగా యూటర్న్ అంకుల్ చంద్రబాబుకు నా విజ్ఞప్తి ఒక్కటే.. ఇప్పటికైనా హోదా టాపిక్‌ను డైవర్ట్ చేయాలనే కుట్రలు మానుకోండి. రాష్ట్రానికి, ప్రజలకు ద్రోహం చేయకండి.. ఒక్క స్టాండ్ మీద నిలబడండి..’ అని విజయసాయి అన్నారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో గొంగళి పురుగునైనా ముద్దాడుతానన్న కేసీఆర్ మాటలను గుర్తుచేసిన విజయసాయిరెడ్డి.. హోదా విషయంలో చంద్రబాబు అలా వ్యవహరించగలరా అని ప్రశ్నించారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్లుగా పోరాడుతున్నది ఒక్క వైఎస్ జగనే. ఈ విషయంలో యూటర్న్ అంకుల్ సర్టిఫికేట్ మాకు అవసరం లేదు. హోదా కోసం ఎవరేం చేశారో ప్రజలకు తెలుసు. అంతిమంగా న్యాయనిర్ణేతలు ప్రజలే’ అని విజయసాయి వ్యాఖ్యానించారు.