హైదరాబాద్ స్కైకి షాకిచ్చిన పుణే
పుణే: యూబీఏ ప్రొ బాస్కెట్‌బాల్ లీగ్‌లో హైదరాబాద్ స్కై జట్టుకు పుణే పెష్వాస్ చేతిలో పరాజయం ఎదురైంది. ఇక్కడి బాలేవడి స్టేడియంలో శనివారం జరిగిన ఈ లీగ్ మ్యాచ్‌లో పుణే 109-99 స్కోరు తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. ఈ టోర్నీలో పుణే జట్టు వరుసగా మూడో మ్యాచ్‌లోనూ వంద పైచిలుకు పాయింట్లు సాధించింది. పెష్వాస్ తరఫున నరేందర్ (27) చక్కని ప్రదర్శన కనబరిచాడు. స్కై జట్టులో మహిపాల్ (26), మహేశ్ (20) రాణించారు.
మొత్తం నాలుగు క్వార్టర్లలోనూ ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దీంతో తొలి క్వార్టర్‌ను పుణే 27-22తో ముగించింది. రెండో క్వార్టర్లో ఒకదశలో హైదరాబాద్ 39-38తో ఒక పాయింట్ ఆధిక్యంలో నిలిచినప్పటికీ... చివరకు పుణే 53-52తో ఆధిక్యంలోకి వచ్చింది. అనంతరం హైదరాబాద్ ఆటగాళ్లు మహిపాల్, మహేశ్ దూకుడుగా ఆడటంతో స్కై జట్టు 79-77తో స్వల్ప ఆధిక్యాన్ని సాధించింది. ఇక చివరి క్వార్టర్లో పెష్వాస్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. దీంతో హైదరాబాద్ పరాజయం చవిచూసింది.