సర్పంచ్ వద్దన్నారు అందుకే..
విజయనగరం కంటోన్మెంట్: మీ పేర్లన్నీ రాశాం. తీరా జాబితా పంపించేసరికి మీ గ్రామసర్పంచ్ వద్దన్నారు. అందుకే చివరినిమిషంలో పేర్లు తొలగించామని ఏఓ అంటున్నారని తుపాను బాధితులు వాపోయారు. ప్రతి వారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ సెల్ విభాగానికి సోమవారం 187 అర్జీలు వచ్చాయి. ఏజేసీ యూసీజీ నాగేశ్వరరావు, డీఆర్వో వై నరసింహారావులు వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్ సెల్‌కు వచ్చిన వినుతుల్లో ప్రధామైనవి ఇలా ఉన్నాయి.
బొండపల్లి మండలం మరువాడ కొత్తవలస గ్రామానికి చెందిన సుమారు 70 మందికి చెందిన పరిహారాల్లో ఒక్క రూపాయికూడా మంజూరు కాలేదని గ్రామానికి చెందిన కర్రోతు శ్రీనివాసరావు, కృష్ణ, దాసరి చిన్నప్పడు, కోరాడ వైకుంఠరావు, మజ్జి రాములు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్‌కు చెందిన సర్పంచ్ వద్దన్నందున మేము మీ పేర్లు తొలగించామని ఏఓ స్వయంగా మాకు చెప్పారని అందుకే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చామని వారు తెలిపారు.
చెరువులు, రహదారులపై నిర్మాణాలకు పొజిషన్లు
విజయనగరంలోని వీటీ అగ్రహారంలో చెరువులు, రహదారులపై ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వ అధికారులు పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేస్తున్నారని అక్కడి కౌన్సిలర్ రొంగలి రామారావు ఫిర్యాదు చేశారు. సమగ్ర సర్వే నిర్వహించి చెరువుల స్వరూపాన్ని కాపాడాలని ఆయన కోరారు.
దేవాలయం ఎదురుగా ఉన్న స్థలాన్ని కబ్జా చేశారు
గంట్యాడ మండలం పెంట శ్రీరామపురం గ్రామంలో ఉన్న నూకాలమ్మ దేవాలయం ఎదురుగా ఉన్న స్థలాన్ని కబ్జా చేయడం వల్ల స్థలం లేక ఎటువంటి ఉత్సవాలు నిర్వహించలేకపోతున్నామని ఆలయ నిర్వహణ కర్త కంచర్ల సర్వదేముళ్లు అర్జీ ఇచ్చారు. ఏటా కనుమ మరుసటి రోజు జరిగే తీర్థ ఉత్సవాలు జరిగే అవకాశం లేదని వెంటనే చర్యలు తీసుకుని అక్కడి స్థలాన్ని ఖాళీ చేయించాలని కోరారు.
సాలూరులో రెవెన్యూ స్టాంపుల కొరత
సాలూరు పట్టణంలో రెవెన్యూ స్టాంపుల కొరత తీవ్రంగా ఉందని, పట్టణానికి చెందిన జే సీతారాం ఏజేసీకి ఫిర్యాదు చేశారు. బహిరంగ మార్కెట్లో మా త్రం ఎక్కువగా ఉంటున్నాయని వెంటనే చర్యలు తీసుకుని స్టాంపుల కొరత లేకుండా చూడాలని కోరారు.
లాకౌట్ ఎత్తివేసినా కార్మికులకు పనుల్లేవు
గరివిడి ఫేకర్ లాకౌట్ ఎత్తివేసినా కార్మికులకు ఉపాధి అందడం లేదని కార్మిక నాయకులు జి పాపారావు, డి దుర్గరాజు,జేవీఆర్ వర్మ, ఆర్ఎస్ఎన్ రాజు, టి అప్పలనారాయణ తదితరులు వినతిపత్రాన్ని అందించారు. పోలీసుబందోబస్తుతో కలెక్టర్ ఫ్యాక్టరీని ప్రారంభించినా నేటి వరకూ కార్మికులను సరిగా విధుల్లోకి తీసుకోవడంలేదని వాపోయారు. వ్యాగన్ లోడింగ్, లారీ లోడింగ్ విషయంలో కార్మికులను పూర్తిస్థాయిలో తీసుకోవాలని నిబంధనలు ఉన్నప్పటికీ అమలు కావడం లేదన్నారు.