ఉదయకిరణ్ అభిమాని ఆత్మహత్య
దత్తిరాజేరు: తన అభిమాన నటుడి మరణాన్ని తట్టుకోలేని ఓ అభిమాని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలంలో కోమటిపల్లి గ్రామంలో ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో లభించిన పాకెట్ డైరీలో ‘నా అభిమాన హీరో ఉదయకిరణ్ చనిపోయాడు. ఇక ఈ జన్మ చాలు. మా మామయ్య కనకకు ఈ మోటారు బైక్ ఇచ్చేయండి. అందరికీ బై’అని రాసి ఉంది.
గ్రామానికి చెందిన నాంగీరి సతీష్(19) బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. గురువారం మధ్యాహ్నం 2గంటల సమయంలో మామడిచెట్టుకు వేలాడుతున్న సతీష్ మృతదేహాన్ని చూసినవారు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి తల్లి కొండమ్మ, సోదరి సత్యవతి ఉన్నారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.