నిర్వాసితులకు అండగా ఉంటాం
దేవీపట్నం : పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురవుతున్న నిర్వాసితులకు అండగా ఉండి సమస్యలపై పోరాడతామని వైఎస్సార్సీపీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, రంపచోడవరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ అన్నారు. మంగళవారం ఆయన పార్టీ శ్రేణులతో కలసి పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్మాణంతో కనుమరుగవుతున్న గండికోట గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులు పలు సమస్యలను అనంతబాబు దృష్టికి తీసుకువచ్చారు. తమకు పూర్తిస్తాయి ప్యాకేజీ చెల్లించకుండా, ఎంతమొత్తం ఇస్తారో తెలియకుండా, నిర్వాసిత కాలనీలో వసతులు కల్పించకుండా తక్షణం గ్రామాన్ని ఖాళీ చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని వాపోయారు. అనంత బాబు మాట్లాడుతూ నిర్వాసిత గిరిజనులకు న్యాయమైన ప్యాకేజీ చెల్లించేంతవరకూ గ్రామాన్ని ఖాళీ చేయరాదని, ఖాళీచేసే తేదీని కటాఫ్ డేట్‌గా గుర్తించి 18 సంవత్సరాలు నిండిన వారికి ప్యాకేజీ అమలు చేయాలని, గిరిజనుల నుంచి సారవంతమైన భూమి తీసుకుని ఇచ్చిన కొండరాళ్ల భూముల స్థానే మరో చోట భూములు సేకరించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే గిరిజనులు కోరుకున్న విధంగా కొత్త చట్టం ప్రకారం పరిహారం అందించాలన్నారు. నిర్వాసితులకు పరిహారాలు చెల్లించకుండా గ్రామాన్ని ఖాళీ చేయించాలని ప్రయత్నిస్తున్న అధికారులు 2013 భూసేకరణ చట్టాన్ని పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని అన్నారు. ఎంపీపీ పండా జయలక్ష్మి, జెడ్పీటీసీ మట్ట రాణి రాంబాబు, పార్టీ నాయకులు కుంజం చెల్లన్నదొర, పోలిశెట్టి శివరామకృష్ణ, కట్టా సత్యనారాయణ, కందుల బాబ్జీ, గారపాటి మురళీకృష్ణ, తుర్రం జగదీష్, మట్ట రాంబాబు, సోదే వెంకన్నదొర, శిరసం పెద్దబ్బాయి దొర, తైలం వీరబాబు, కోమలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
బాధితులకు న్యాయం చేయాలి
ఎమ్మెల్యే రాజేశ్వరి
దేవీపట్నం : పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ నిర్మాణంతో కనుమరుగవుతున్న గండికోట గిరిజనులకు న్యాయమైన ప్యాకేజీ చెల్లించిన తర్వాతే గ్రామాన్ని ఖాళీచేయించాలని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి అన్నారు. మంగళవారం సాయత్రం ఆమె గండికోట గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులు తమ సమస్యలను విన్నవించారు. తమ గ్రామంలో కనీసం గ్రామ సభ నిర్వహించకుండా, ఎంత ప్యాకేజీ చెల్లిస్తారో తెలియజేయకుండా , కొంత మొత్తం జమ చేసారని వాపోయారు. గ్రామంలో తల్లిదండ్రులు లేని ఆరుగురు యువతీ, యువకులను ప్యాకేజీకి అర్హతలేదంటున్నారని తెలపారు. గిరిజనులకు భూమికి భూమి పరిహారంగా ఇచ్చిన కొండలను పరిశీలించారు. దీనిపై ఎమ్మెల్యే మాట్లాడుతూ న్యాయమైన ప్యాకేజీ చెల్లించేంతవరకూ గ్రామాన్ని ఖాళీచేసేది లేదని, 2013 భూసేకరణ చట్టం ప్రకారం నిర్వాసితులకు న్యాయమైన ప్యాకేజీ చెల్లించాలని డిమాండ్ చేశారు. అంతవరకూ నిర్వాసితులకు అండగా వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. పార్టీ మండల కన్వీనర్ నండూరి గంగాధరరావు, ఎంపీటీసీ సభ్యురాలు పరదా శీతారత్నం, నండూరి సీతారామ్ తదితరులు పాల్గొన్నారు.