శివసేన లేకుండానే ‘మహా’ ప్రభుత్వం!
ఎన్సీపీ మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ మొగ్గు
ముంబై: మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారంలో మరో మలుపు! అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. ఎన్సీపీ బయటనుంచి ఇచ్చే మద్దతు తీసుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశమున్నట్లు శనివారం సంకేతాలు వెలువడ్డాయి. శివసేనతో చర్చలు సాగుతూనే ఉన్నా.. పార్టీ శ్రేణుల మనోభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్సీపీ మద్దతుతోనే ముందుకెళ్లే అవకాశమున్నట్లు పార్టీ అగ్రనేత ఒకరు పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడకపోవచ్చన్నారు. సేనతో కలసి సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు ఎమ్మెల్యేలు, క్షేత్రస్థాయి కార్యకర్తలు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారని మరో బీజేపీ సీనియర్ నేత అన్నారు.
ప్రధానిమోదీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలపై సేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సహా ఆ పార్టీ నేతలు చేసిన వ్యక్తిగత విమర్శలపై తమ పార్టీ శ్రేణులు ఇంకా ఆగ్రహంగానే ఉన్నాయన్నారు. కాగా, సీఎం రేసులో ముందంజలో ఉన్న ఫడణ్వీస్, శాసనమండలి విపక్షనేత వినోద్ తావ్డేలు శనివారం.. మోదీని ముంబై విమానాశ్రయంలో కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. సేనతో పొత్తు పునరుద్ధణపై పార్టీలో వస్తున్న వ్యతిరేకత గురించి వారు ప్రధానికి చెప్పినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో బీజేపీ కొత్త ప్రభుత్వం ఈ నెల 29, లేదా 30న ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నిక పరిశీలన కోసం నియమితులైన రాజ్నాథ్ సింగ్ 27న ముంబై రానున్నారు.