‘కథ’ మళ్లీ మొదటికి..!
బీజేపీ, శివసేన మధ్య చర్చలకు తెర
* ప్రతిపక్షంలోనే ఉంటామని ఉద్ధవ్ స్పష్టీకరణ
* కేంద్ర కేబినెట్లోనూ చేరని శివసేన ఎంపీ
* రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని ప్రకటన
* ప్రతిపక్ష నేతగా ఏక్నాథ్ షిండే ఎంపిక
* ఇరకాటంలో బీజేపీ
సాక్షి, ముంబై: ఇన్ని రోజులుగా ఉత్కంఠగా సాగుతున్న రాష్ట్ర రాజకీయాలకు నేటితో తెరపడినట్లయ్యింది. ప్రతిపక్షంలోనే ఉంటామని ఆదివారం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఇన్నాళ్లూ బీజేపీ, శివసేన మధ్య ‘పొత్తు’ విషయమై నడుస్తున్న వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లయ్యింది. తమ పార్టీ ప్రతిపక్షంలో కూర్చుం టుందని, తమ పక్ష నాయకుడిగా ఏక్నాథ్ షిండే వ్యవహరిస్తారని ఉద్ధవ్ ప్రకటించారు. ఆయన ఆదివారం శివసేన పార్టీ ప్రధాన కార్యాలయమైన ‘సేవా భవన్’లో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలూ అందరూ హాజరయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో బీజేపీతో పొత్తుపై చర్చించారు. ప్రభుత్వంలో చేరడం కన్నా ప్రతిపక్షంగా ఉంటేనే మంచిదని నిర్ణయించారు. అనంతరం ఉద్ధవ్ మీడియాతో మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నా.. లేక పోయినా.. రాష్ట్రానికి న్యాయం చేస్తామని అన్నారు. ప్రజల అభిరుచికి అనుగుణంగా తమ పార్టీ ఎమ్మెల్యేలందరూ పనిచేస్తారని హామీ ఇచ్చారు. బీజేపీ ఒకవేళ ఎన్సీపీ మద్దతు తీసుకుంటే తాము ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అయితే ముందు ఎన్సీపీపై తమ వైఖరేంటో బీజేపీ స్పష్టం చేయాలని సవాలు విసిరారు. ఆ తర్వాతే కేంద్రంలో కొనసాగేది,లేనిదీ ఆలోచిస్తామన్నారు.
‘దేశంలో హిందువులను విడదీసేందుకు కుట్ర జరుగుతోంది.. హిందుత్వ వాదానికి కట్టుబడి ఉన్న ఇరు పార్టీలు విడిపోకూడదనే ఇన్నాళ్లూ మేం ప్రయత్నాలు చేస్తున్నాం.. రాష్ట్రంలో స్థిర ప్రభుత్వం కావాలని కోరుకున్నాం.. కాని బీజేపీ ఆలోచన వేరేగా ఉంది.. వారు మమ్మల్ని అగౌరవంగా చూస్తున్నారు.. మా ఆలోచనలను చులకనగా భావిస్తున్నారు.. అందుకే మా దారి మేం చూసుకుందామని నిర్ణయించుకున్నామ’ని వివరించారు.
గత అక్టోబర్ 15న శాసనసభ ఎన్నికలు జరగ్గా 19న ఫలితాలు వెలువడ్డాయి. అందులో బీజేపీకి 122 సీట్లు రాగా, శివసేనకు 63, కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41 స్థానాలు గెలుచుకున్నాయి. కాగా, బీజేపీకి బేషరతుగా మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఎన్సీపీ నాయకుడు శరద్ పవార్ అప్పుడే ప్రకటించారు. అయితే ఎన్నికల ప్రచార సమయంలో ప్రధాని మోదీ స్వయంగా ఎన్సీపీపై అవినీతి ఆరోపణలు చేయడం, ఎన్సీపీ సైతం ప్రధానిపై ప్రతి విమర్శలు గుప్పించడం జరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఎన్సీపీ మద్దతు తీసుకుంటే ప్రజల్లో బీజేపీ పలుచనైపోయే ప్రమాదముందని ఆ పార్టీ స్థానిక నాయకులు వాదించారు.
అలాగే శివసేనతో పొత్తును పునరుద్ధరించుకోవాలని బీజేపీ సీనియర్ నాయకుడు అద్వానీ వంటివారు సైతం సూచించారు. దీంతో శివసేనతో బీజేపీ అప్పటినుంచి ‘పొత్తు’పై చర్చలు జరుపుతోంది. అయితే ఈ రెండు పార్టీలమధ్య పదవుల కేటాయింపులో పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. కేంద్రంలో పదవులు ఇచ్చి శివసేనను శాంతపరిచేందుకు బీజేపీ అధిష్టానం చేసిన యత్నాలు బెడిసికొట్టాయి. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది. బీజేపీతో కలవబోమని, ప్రతిపక్షంలో కూర్చుంటామని శివసేన స్పష్టం చేయడంతో బీజేపీ మైనారిటీ ప్రభుత్వం ఎవరి మద్దతు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.. ఇదిలా ఉండగా సోమవారం ఫడ్నవిస్ ప్రభుత్వం బలనిరూపణ చేసుకోవాల్సి ఉంది.