‘దివి’లో రెండోరోజు కాపుల దీక్ష భగ్నం
అవనిగడ్డ, భావదేవరపల్లి, చల్లపల్లి, మోపిదేవిలో దీక్షలను భగ్నం చేసిన పోలీసులు
అవనిగడ్డలో దీక్షకు మద్దతు తెలిపిన వైఎస్సార్సీపీ కన్వీనర్ సింహాద్రి
అవనిగడ్డ : కాపులను బీసీల్లో చేర్చాలని కోరుతూ ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతుగా దివిసీమలో పలుచోట్ల రెండోరోజైన ఆదివారం కాపు నేతలు చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
దీక్షకు వైఎస్సార్సీపీ కన్వీనర్ సింహాద్రి మద్దతు
అవనిగడ్డ టీటీడీ కల్యాణమండపం ఎదురుగా కాపునేతలు రాజనాల బాలాజీ, ఇమ్మిడిశెట్టి వెంకటేష్ రెండోరోజు దీక్షచేశారు. వీరితోపాటు రేపల్లె హేమ, పూషడపు మనోహర్ దీక్ష చేశారు. వైఎస్సార్సీపీ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు, కడవకొల్లు నరసింహారావు వీరికి పూలమాలలు వేసి మద్దతు తెలిపారు. వారు మాట్లాడుతూ బీసీలకు అన్యాయం జరగకుండా తమిళనాడు తరహాలో రాష్ట్రంలో కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే నెరవేర్చమంటున్నామన్నారు ప్రభుత్వం స్పందిం చి బీసీలను కాపుల్లో చేర్చే కార్యక్రమాన్ని చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. కాపు సంఘం ఐక్యవేదిక నాయకులు అన్నపరెడ్డి వెంకటస్వామి, కొండవీటి కిశోర్, రాధా-రంగా మిత్రమండలి దివియూనిట్ అధ్యక్షుడు రాజనాల మాణిక్యాలరావు తదితరులు దీక్షకు మద్దతు తెలిపారు.
దీక్షను భ గ్నం చేసిన పోలీసులు
విషయం తెలుసుకున్న వెంటనే ఎస్ఐ వెంకటకుమార్ నేతృత్వంలో పోలీసులు దీక్షా శిబిరానికి చేరుకుని దీక్షను భగ్నం చేశారు. దీక్ష చేస్తున్నవారిని బలవంతంగా ట్రక్ ఆటోలో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం 144వ సెక్షన్ అమలులో ఉండగా దీక్షచేయమని పేర్కొంటూ వారివద్ద నుంచి పోలీసులు సంతకాలు తీసుకున్నారు.
చల్లపల్లిలో
చల్లపల్లి ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా అడపా రాంబాబు, ఆది రాంబాబు, అడపా బాబూరావు, సోమిశెట్టి శివనాగేశ్వరరావు దీక్షచేశారు. ఈ దీక్షకు న్యాయవాది మోపిదేవి ద్వారకానాథ్‌తో పాటు పలువురు నాయకులు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ మణికుమార్ దీక్షను భగ్నం చేసి, వారిని బలవంతంగా పోలీసు వాహనంలో స్టేషన్‌కి తీసుకెళ్లారు.
నాగాయలంక, భావదేవరపల్లిలో కాపుల దీక్షలు
భావదేవరపల్లి(నాగాయలంక) : కాపునేత ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణదీక్షకు మద్దతు పలుకుతూ ప్రభుత్వతీరుకు నిరసనగా భావదేవరపల్లిలో గ్రామస్తులు రెండవరోజు ఆదివారం రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. పూషడపు నిరంజనరావు, ముమ్మారెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పెదప్రోలులో..
పెదప్రోలు(మోపిదేవి) : కాపులు బీసీల్లో చేర్చాలని మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా పెదప్రోలు ప్రధాన సెంటరో కాపులు మహిళలతో కలసి దీక్ష చేపట్టారు. 2014 ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీని నెరవేర్చాలని కంచాలు, గరిటెలతో నినాదాలు చేశారు.
శ్రీకాకుళం(అవనిగడ్డ) : శ్రీకాకుళంలో ఆదివారం కాపునేతలు దీక్ష చేశారు. కాపు సంఘం రాష్ట్ర నేత సింహాద్రి శ్రీనివాసరావుతో పాటు పలువురు కాపు సంఘం నేతలు దీక్ష చేపట్టారు. వైఎస్సార్సీపీ చేనేత విభాగం జిల్లా నేత అందె జగదీష్ దీక్షకు మద్దతు తెలిపారు. వైఎస్సార్సీపీ నేతలు మురళి, సత్యనారాయణ, కాంగ్రెస్ నేత కృష్ణారావు దీక్షకు మద్దతు తెలిపారు.