విద్యుత్ ఇంజనీర్ల పనితీరు అస్తవ్యస్తం
► ‘డక్ట్’లేకుండా అడ్డదిండ్డంగా యూజీ కేబుల్ వర్క్స్
► నిర్దేశించిన దానికంటే తక్కువ లోతులో లైన్లు
► తవ్విన చోటే..తవ్వకాలు..
► ప్రమాదాలకు నిలయంగా∙కేబుల్ గుంతలు..
► ఆరు నెలల పాటు తవ్వకాలపై జీహెచ్ఎంసీ నిషేధం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ను విశ్వనగరం చేద్దామని పాలకులు చెబుతూనే ఉన్నారు.. అయితే మన తెలంగాణ విద్యుత్ ఇంజనీర్లు మాత్రం నగరాన్ని అలాగే ఉంచాలని చూస్తున్నట్లే ఉంది. భూగర్భకేబుళ్ల ఏర్పాటు విషయంలో చిన్న చిన్న దేశాలు సైతం‘డక్ట్’ఏర్పాటు చేసుకుంటుంటే.. ఐటీ కేంద్రంలోని ట్రాన్స్‌కో–డిస్కంలు మాత్రం ఇప్పటికీ పాతవిధానాలనే అనుసరిస్తున్నాయి. అంతేకాదు ఒకరు తవ్విన చోట మరొకరు తవ్వకాలు జరుపుతూ రూ.కోట్లు ఖర్చు చేసి వేసిన రోడ్లను ధ్వంసం చేస్తున్నారు.
సకాలంలో ఈ పనులు పూర్తి చేయకపోవడం, చాలాచోట్ల గుంతలను పూడ్చకుండా అలాగే వదిలేయడం వల్ల ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. హైదరాబాద్ కోర్‌సిటీలో డక్ట్‌ల ఏర్పాటు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. నగరంలో ఇప్పటికే మురుగునీటి కాల్వలు, మంచినీటి పైప్లైన్లు పూర్తయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో ఇక్కడ డక్ట్‌ల ఏర్పాటు సాధ్యం కాదు, కానీ ఔటర్ రింగ్‌రోడ్డుకు ఆనుకుని ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న శంషాబాద్, గచ్చిబౌలి, శేర్లింగంపల్లి, బెంగుళూరు జంక్షన్ వంటి ఐటీ కారిడార్స్‌లో ప్రత్యేక లైను(డక్ట్)ఏర్పాటుకు అవకాశం ఉన్నా ఇంజనీర్లు పట్టించుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పనులన్నీ ఒకరిద్దరికే అప్పగించడం వల్లే..
చెట్ల కొమ్మలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయంగా ఎయిర్బంచ్డ్(ఏబీ)కేబుల్స్, హెచ్‌టీ, ఎల్టీ ఓవర్‌హెడ్ లైన్స్ స్థానంలో అండర్ గ్రౌండ్(యూజీ)కేబుల్ వేయాలని నిర్ణయించారు. ఇప్పటికే 306 కిలోమీటర్ల యూజీ కేబుల్ అమర్చగా, మరో 300 కిలో మీటర్లు ఏబీ కేబుల్స్ వేశారు. ప్రస్తుతం వినాయక్‌న గర్–మౌలాలి, మల్కారం–యాప్రాల్, డిఫెన్స్ కాలనీ–యాప్రాల్, మల్లాపూర్–మౌలాలి, మల్కారం– కుషాయిగూడ, సూరారం– ఆర్జీకే కాలనీ, ఆటోనగర్–భగత్‌సింగ్‌నగర్, రంగారెడ్డి జిల్లా కోర్టులు–ఆటోనగర్, మోహన్‌నగర్–కొత్తపేట్, అబ్దుల్లాపూర్‌మెట్–రామోజీ ఫిలింసిటీ, కాటేదాన్–శివరాంపల్లి,
ఉప్పర్‌పల్లి–శివరాంపల్లి, ముఫకంజాకాలేజీ–రోడ్‌నెంబర్13, రవీంద్ర కోఆపరేటివ్ సొసైటీ, ఎల్వీప్రసాద్ మార్గ్, బల్కంపేట–ఫీవర్ ఆస్పత్రి, ఉస్మానియా యూనివర్సిటీ–ఫీవర్ ఆస్పత్రి, సుల్తాన్‌బజార్–ఫీవర్ ఆస్పత్రి, నిమ్స్–ఏసీగార్డ్స్, నాంపల్లి, గోషామహల్, పాటిగడ్డ–ఇందిరాపార్కు, నిజాంకాలేజీ–పబ్లిక్‌గార్డెన్, చాంద్రాయణగుట్ట–సంతోష్‌నగర్, సబ్స్టేషన్ల మధ్య భూగర్భ కేబుల్ పనులు కొనసాగుతున్నాయి. నిజానికి వర్షాకాలం ఆరంభానికి ముందే ఈ పనులను పూర్తి చేయాల్సిఉంది. కానీ కమీషన్లకు కక్కుర్తి పడిన అధికారులు ఈ పనులన్నీ ఒకరిద్దరు కాంట్రాక్టర్లకే అప్పగించారు. సకాలంలో పనులు పూర్తికాక పోవడానికి ఇదే కారణమని సీనియర్ ఇంజనీర్లు అభిప్రాయపడుతున్నారు.
తవ్విన చోటే...తవ్వడం..
ట్రాన్స్‌కో పర్యవేక్షణలో 220కేవీ, 132 కేవీ, 33కేవీ యూజీ కేబుల్ వర్క్ జరుగుతుండగా, 33/11కేవీ కేబుల్ వర్క్స్‌ను మాస్టర్‌ప్లాన్ విభాగం పర్యవేక్షిస్తుంది. ట్రాన్స్‌కో తవ్విన కొద్ది రోజులకే అదే చోట డిస్కం తవ్వకాలు జరుపుతోంది. తవ్విన చోటే తవ్వడం వల్ల రహదారులు దెబ్బతినడంతో పాటు ప్రజాధనం పెద్ద ఎత్తున దుర్వినియోగం అవుతోంది. జేసీబీతో తవ్వకాలు జరుపుతుండటంతో అప్పటికే భూమిలో వేసిన కేబుళ్లు పాడవుతున్నాయి. రోలింగ్‌తో కాకుండా కేబుళ్లను తాడుతో లాగడం వల్ల దెబ్బతింటున్నాయి.
వాహనాల తాకిడికి భూమిలోపల ఉన్న కేబుల్ ఒత్తిడికి గురై, వేసిన కొద్ది రోజులకే పాడవుతుంది. పాటిగడ్డ, నెక్లెస్‌రోడ్డు, ఇమ్లీబన్ సబ్‌స్టేçÙన్, కళ్యాణ్‌నగర్, నిజాంకాలేజీ లైన్లలో ఇప్పటికే ఒకసారి తవ్వి కేబుల్ వేశారు. తాజాగా మళ్లీ అదే చోట తవ్వకాలు జరుపుతున్నారు. అంతేకాదు 1.2 మీటర్ల లోతులో వేయాల్సిన కేబుల్‌ను అరమీటరు లోతులో వదిలేశారు. గుంతలను ఇప్పటికీ పూడ్చక పోవడంతో అవి ప్రమాదాలకు నిలయంగా మారాయి.
ఇటీవల కళ్యాణ్‌నగర్, శ్రీనగర్ కాలనీలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాలకు ఇదే కారణం. ఇదిలా ఇటీవల వరుసగా వర్షాలు కురుస్తుండటంతో నగరంలో ఎలాంటి తవ్వకాలు చేపట్టరాదని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది. రోడ్ల తవ్వకాలపై ఆరు మాసాల పాటు నిషేధం విధిస్తూ ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అయినా నగరంలో తవ్వ కాలు మాత్రం ఆగకపోవడం విశేషం.