ప్రధానిపై దాడికి ఐసిస్ విఫలయత్నం
►బాంబు కూడా అమర్చిన ముష్కరులు
►ఎన్ఐఏ విచారణలో వెల్లడి
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో ఉజ్జయిన్ ప్యాసింజర్‌లో పేలుడు జరిపిన ఐసిస్ ఉగ్రవాదులు ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీపైనా దాడికి విఫలయత్నం చేశారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గురువారం వెల్లడించింది. గతేడాది దసరా సమయంలో మోదీ లక్నోలో నిర్వహించిన దాడికి ఐసిస్ కుట్ర పన్నింది. ర్యాలీ జరిగే రామ్‌లీలా మైదాన్‌లో అక్టోబరు 17న బాంబు పెట్టాలని అనుకున్నామని ఈ కేసులో అరెస్టయిన ఐసిస్ ఉగ్రవాదులు మహ్మద్ డానిష్, ఆతిఫ్ ముజఫర్, వీరి స్నేహితులు విచారణలో వెల్లడించారు. ఇందుకోసం మైదానం దగ్గర రెక్కీ కూడా జరిపారు. ర్యాలీకి ముందు రోజు అక్కడున్న చెత్తడబ్బాలో బాంబు అమర్చి వచ్చారు. అయితే ర్యాలీ తరువాత కూడా పేలుళ్ల గురించి సమాచారం రాలేదు.
రెండు రోజుల తరువాత అక్కడికి ముజఫర్ వెళ్లి చూడగా, వైర్లు మాత్రమే కనిపించాయి. ఐసిస్ సత్తా చాటేందుకు డానిష్ పలుచోట్ల బాంబు పేలుళ్లకు యత్నించినా అవేవీ సఫలం కాలేదు. ఈ ఐసిస్ సభ్యుల బృందానికి నాయకుడిగా (ఆమిర్) ప్రకటించుకున్న ముజఫర్ స్టీలు పైపులు, షాండ్లియర్ బల్బులతో బాంబులు కూడా తయారు చేశాడు. ఉజ్జయిన్లో రైలులో ఈ నెల ఏడున జరిగిన పేలుళ్ల కేసులో వీరిద్దరితోపాటు ఏడుగురిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. వీరందరికీ భారత వైమానిక దళం మాజీ ఉద్యోగి ఒకరు సాయం చేసినట్టు గుర్తించి, అతణ్నీ అరెస్టు చేసింది. పేలుడులో 10 మందికి గాయాలయ్యాయి.