విమానంలో నిద్రిస్తున్న అమ్మాయిపై..!
లండన్: విమానంలో నిద్రిస్తున్న యువతిపై లైంగిక దాడి కేసులో భారత సంతతి వ్యాపారవేత్త దోషిగా తేలాడు. అతనికి బ్రిటన్ కోర్టు 20 వారాల జైలుశిక్ష విధించింది. కతార్‌కు చెందిన వ్యాపారవేత్త అయిన సుమన్ దాస్ (46) గత జూలైలో బ్రిటన్‌లోని మాంచెస్టర్ విమానాశ్రయంలో అరెస్టయ్యాడు. బ్రిటన్ విమానంలో తన పక్క సీటులో కూర్చున్న సుమన్.. నిద్రిస్తున్న సమయంలో తనను అసభ్యరీతిలో తాకి.. వెకిలిగా ప్రవర్తించాడని 18 ఏళ్ల యువతి ఆరోపించింది. ఆ యువతి ఆరోపణల్ని సుమన్ తోసిపుచ్చారు. తాను అనుకోకుండా ఆమెను తాకి ఉండొచ్చునని, కానీ ఉద్దేశపూరితంగా తాకలేదని చెప్పుకొచ్చాడు. అయితే, కోర్టు మాత్రం అతన్ని దోషిగా తేల్చింది.
‘అతను ఏం చేస్తున్నాడో అతనికి తెలుసు. ఆ సమయంలో అతడు నిద్రపోవడం లేదు. అతను నన్ను చూస్తున్నాడు. అతను నన్ను చూడటం నేను చూశాను. నేను మేలుకువ ఉన్నానో లేదా తెలుసుకోవడానికి నన్ను చూస్తూనే అసభ్యంగా ప్రవర్తించాడు’ అని బాధితురాలు కోర్టుకు తెలిపింది. తాను మేలుకున్నానని తెలియగానే అతను వెంటనే పక్కకు కదిలాడని పేర్కొంది. ‘ఇది లైంగిక దాడే.. పరిస్థితులను అనుకూలంగా ఈ దారుణానికి నువ్వు పాల్పడ్డాడు. ఇది కొంతసేపే జరిగి ఉండవచ్చు కానీ, అత్యంత సాన్నిహిత్యంగా ఆమెను తాకడం ద్వారా బాధితురాలకి వేదన మిగిల్చావు’ అని జడ్జి సామ్ గూజీ తెలిపారు. భారత్‌లో పుట్టిపెరిగి కతార్‌లో ఉంటున్న సుమన్ దాస్ బ్రిటన్ వాసి కాకపోవడంతో అతనికి కమ్యూనిటీ సర్వీస్‌లాంటి తేలికైన శిక్ష విధించకుండా.. 20 వారాల జైలుశిక్షను కోర్టు విధించింది.