UK Visas
-
పెరగనున్న బ్రిటన్ వీసాలు
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: భారతీయులకు లభించే బ్రిటన్ వీసాలు పెరిగి భారత్–యూకే వ్యాపార, విద్య, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. పరస్పర వాణిజ్య ప్రయోజనాల లక్ష్యంతో సరిగ్గా ఏడాది కింద రెండు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందపు కార్యాచరణ ప్రారంభమైందని భారత్‌లో బ్రిటిష్ హైకమిషనర్ డొమినిక్ అశ్క్విత్ తెలిపారు. మరిన్ని వీసాల లభ్యత, సాంకేతిక క్లస్టర్ల ఏర్పాటు వంటివి ఈ దిశలో ఒక ముందడుగు కాగలవని అన్నారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానం(ఐటీ)లో ఇప్పటికే ఇక్కడున్న చొరవ దృష్ట్యా, ఈ భాగస్వామ్యాన్ని మరింత ఫలవంతం చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాలు క్రియాశీల పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్ వచ్చిన అశ్క్విత్ తనను కలిసిన పాత్రికేయులతో కాసేపు ఇష్టాగోష్ఠి జరిపారు. ఏడాది కిందట భారత ప్రధాని నరేంద్ర మోదీ లండన్ పర్యటన సందర్భంగా బ్రిటన్ ప్రధాని థెరిసా మేతో ఈ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సాంకేతిక సహకారం–వాణిజ్య విస్తరణతో ఉభయ దేశాల పరస్పర ప్రయోజనం ఇందులో ప్రాధాన్యతాంశమని అశ్క్విత్ పేర్కొన్నారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఆధునిక రవాణా వ్యవస్థల ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యాల్ని భారత్‌లో విస్తరించడానికి ఇప్పటికే బ్రిటన్ వ్యాపార–వాణిజ్య సంస్థలు సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తాము కాల్టెక్ హబ్స్ ఏర్పాటు చేయడం ద్వారా, ఇక్కడ వినూత్న తరహాలో వచ్చిన అంకుర సంస్థల(స్టార్టప్స్)తో భాగస్వామ్యాలకు బ్రిటన్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. దక్షిణాదిలో హైదరాబాద్ మరింత ప్రయోజనకారి కాగలదని అంచనా వేశారు. బ్రిటన్ నైపుణ్యాల్ని, సాంకేతిక సహకారాన్ని గరిష్టంగా వినియోగించుకునేలా ఇక్కడి స్టారప్స్‌తో అనుసంధానించే నైపుణ్య మానవ వనరుల్ని సమకూర్చడం ద్వారా తెలంగాణ ‘టీ–హబ్’కీలక పాత్రదారి కానుందని అభిప్రాయపడ్డారు. చమురు కోసం సముద్ర గర్భాన్ని తొలిచే సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో బ్రిటన్ కంపెనీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో చమురు–సహజవాయు రంగంలో పనిచేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. విద్య, ఉద్యోగ రంగాల్లోనూ పెరగనున్న వీసాలు ఐరోపా సంఘం (ఈయూ) నుంచి బ్రిటన్ వైదొలగుతున్న నేపథ్యంలో కొత్త వలసల విధానం రూపుదిద్దుకుంటోందని అశ్క్విత్ తెలిపారు. దాంతో భాగస్వామ్య వృద్ధిలో, విద్య–ఉద్యోగావకాశాల్లో భారత్ వంటి దేశాలకు మున్ముందు చక్కని అవకాశాలుం టాయని అన్నారు. ఐటీ, వైద్య రంగంలో భారత్ దృఢంగా ఉందని వ్యాఖ్యానించారు. భారత్ నుంచి యూకేలో ఉన్నత విద్యకు వెళ్లే వారిప్పుడు 37 శాతం పెరిగారని చెప్పారు. గత సంవత్సరం ఈ వృద్ధి రేటు 17 శాతంగా ఉందన్నారు. ప్రతి 10 మందిలో 9 మంది విద్యార్థులకు వీసాలు లభించే పరిస్థితి ఉందన్నారు. యూకే విశ్వవిద్యాలయాల సామర్థ్యాన్ని భారత విద్యార్థులు గరిష్టంగా వినియోగించుకోవాలన్నదే తమ కోరికని, పెరుగుతున్న సంఖ్యే దానికి నిదర్శనమన్నారు. వాణిజ్య, విద్య, ఉద్యోగ వీసాల్లో వృద్ధి వల్ల బ్రిటన్ సందర్శించే భారతీయుల సంఖ్య పెరుగుతుందని, ఇది పరస్పర వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల్ని మెరుగుపరుస్తుందని అన్నారు. రానున్న క్రికెట్ ప్రపంచకప్ సందర్భంగా కూడా బ్రిటన్‌కు భారతీయ సందర్శకులు పెరుగుతారని అభిప్రాయపడ్డారు. 2018లో భారత్‌కు చెందిన నైపుణ్యం గల ఉద్యోగులు, సిబ్బందికి 55,000 బ్రిటన్ వీసాలు లభించాయని, మిగతా అన్ని దేశాలకు కలిపి దాదాపు ఇన్నే లభించాయని గుర్తు చేశారు. -
శాస్త్రవేత్తలకు, విద్యావేత్తలకు కొత్త వీసాలు
లండన్ : భారత్‌తో పాటు విదేశీ శాస్త్రవేత్తలకు, విద్యావేత్తలకు యూకే వీసా నిబంధనలను సరళతరం చేసింది. వీరి కోసం కొత్త రకం వీసాలను ప్రవేశపెట్టింది. ఆ దేశంలో పరిశోధన రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం ఈ కొత్త రకం వీసాలను తీసుకొచ్చినట్టు యూకే పేర్కొంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న టైర్ 5 వీసా రూట్‌కి కొత్త యూకేఆర్ఐ సెన్స్, రీసెర్చ్, అకాడమియా స్కీమ్‌ను జతచేర్చుతున్నట్టు తెలిపింది. దీన్ని యూరోపియన్ యూనియన్ వెలుపల నుంచి యూకేకు రెండేళ్ల వరకు వచ్చే విద్యావేత్తలకు, శాస్త్రవేత్తలకు జూలై 6 నుంచి అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొంది. పరిశోధన, నూతన ఆవిష్కరణలకు యూకే ప్రపంచ లీడర్‌గా ఉందని, యూకేలో పనిచేయడానికి, శిక్షణ తీసుకోవడానికి అంతర్జాతీయ పరిశోధకులకు ఈ వీసాలు ఎంతో ఉపయోగపడనున్నాయని యూకే ఇమ్మిగ్రేషన్ మంత్రి కారోలైన్ నోక్స్ తెలిపారు. ఈ వీసాలు యూకే వీసా నిబంధనలను సరళతరం చేస్తాయని పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రతిభను ఆకట్టుకోవడానికి తప్పనిసరిగా మెరుగైన ఇమ్మిగ్రేషన్ సిస్టమ్‌ను తాము కలిగి ఉండాలని పేర్కొన్నారు. వారి నైపుణ్యం నుంచి తాము ప్రయోజనం పొందనున్నామని చెప్పారు. యూకే ఆర్థిక వ్యవస్థకు, సమాజానికి, శాస్త్రవేత్తల, విద్యావేత్తల పాత్ర ఎంతో కీలకమన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రీయ, పరిశోధన ప్రతిభను ఆకట్టుకుంటూ... యూకేను ప్రపంచంలో అగ్రగామిగా ఉంచుతామన్నారు. ఈ స్కీమ్‌ను యూకే పరిశోధన, నూతనావిష్కరణ సంస్థ(యూకేఆర్ఐ) నిర్వహిస్తుంది. ఇది దేశీయంగా ఉన్న ఏడు రీసెర్చ్ కౌన్సిల్స్‌ను ఒక్క తాటిపైకి చేరుస్తుంది. యూకేఆర్ఐ, దాంతో పాటు 12 ఆమోదిత పరిశోధన సంస్థలు ఇక నుంచి ప్రత్యక్షంగా అత్యంత నిపుణులైన ప్రజలకు స్పాన్సర్ చేయడానికి వీలవుతుంది. వారికి యూకేలో శిక్షణ ఇచ్చేందుకు, పని చేసేందుకు ఈ కొత్త వీసాలు ఎంతో సహకరించనున్నాయని యూకేఆర్ఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రొఫెసర్ మార్క్ వాల్‌పోర్ట్ చెప్పారు. స్పాన్సర్ ఆర్గనైజేషన్లను కూడా యూకేఆర్‌ఐనే నిర్వహిస్తోంది. -
బ్రిటన్ వీసా ఫీజుల పెంపు
లండన్: బ్రిటన్ ప్రభుత్వం ఈ నెల 18 నుంచి దాదాపు అన్ని రకాల వీసా ఫీజులు పెంచనుంది. షార్ట్‌టైమ్ విజిటర్స్, వర్క్, స్టడీ వీసాల ఫీజు రెండు శాతం.. నేషనాలిటీ, సెటిల్మెంట్, రెసిడెంట్ వీసా దరఖాస్తులకు 25 శాతం ఫీజు పెంచాలని జనవరిలో ప్రతిపాదించారు. ప్రతిపాదనల ప్రకారం బ్రిటన్‌లో సెటిల్మెంట్ లేదా ఐఎల్ఆర్ దరఖాస్తుదారుల ఫీజు 1,500 పౌండ్ల (సుమారు రూ. 1,42,450) నుంచి 1,875 పౌండ్ల (సుమారు రూ. 1,78,062)కు పెరగనుంది. ఇకపై ఫ్యామిలీ, స్పౌస్ వీసాలకు 1,195 పౌండ్లు (సుమారు రూ. 1,13,580) అడల్ట్ డిపెండెంట్ రిలేటివ్స్‌కు 2,676 పౌండ్లు(సుమారు రూ.2,54,462) చెల్లించాలి. కిందటేడాది బ్రిటన్‌లో నివసించేందుకు, పనిచేసేందుకు వీసాలు మంజూరైన వేలాది భారతీయులపై పెంపు ప్రభావం పడనుంది. ప్రతి ఏడాది బ్రిటన్ వీసాలు పొందేవారిలో భారతీయులే అధికంగా ఉంటారు. ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటస్టిక్స్ ప్రకారం కిందటేడాది 92,062 మందికి రెసిడెంట్, వర్క్ వీసాలు మంజూరు చేస్తే.. అందులో 57 శాతం మంది భారతీయులే. అత్యుత్తమ సేవల కోసం ఫీజులు పెంచుతున్నట్లు బ్రిటన్ వెల్లడించింది.