పెరగనున్న బ్రిటన్‌ వీసాలు | India And UK relations to be strengthened | Sakshi
Sakshi News home page

పెరగనున్న బ్రిటన్‌ వీసాలు

Published Thu, May 9 2019 2:45 AM | Last Updated on Thu, May 9 2019 8:27 AM

India And UK relations to be strengthened - Sakshi

బ్రిటిష్‌ హైకమిషనర్‌ డొమినిక్‌ అశ్క్విత్‌

సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్‌: భారతీయులకు లభించే బ్రిటన్‌ వీసాలు పెరిగి భారత్‌–యూకే వ్యాపార, విద్య, సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి. పరస్పర వాణిజ్య ప్రయోజనాల లక్ష్యంతో సరిగ్గా ఏడాది కింద రెండు దేశాలు కుదుర్చుకున్న ఒప్పందపు కార్యాచరణ ప్రారంభమైందని భారత్‌లో బ్రిటిష్‌ హైకమిషనర్‌ డొమినిక్‌ అశ్క్విత్‌ తెలిపారు. మరిన్ని వీసాల లభ్యత, సాంకేతిక క్లస్టర్ల ఏర్పాటు వంటివి ఈ దిశలో ఒక ముందడుగు కాగలవని అన్నారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానం(ఐటీ)లో ఇప్పటికే ఇక్కడున్న చొరవ దృష్ట్యా, ఈ భాగస్వామ్యాన్ని మరింత ఫలవంతం చేయడంలో రెండు తెలుగు రాష్ట్రాలు క్రియాశీల పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌ వచ్చిన అశ్క్విత్‌ తనను కలిసిన పాత్రికేయులతో కాసేపు ఇష్టాగోష్ఠి జరిపారు.

ఏడాది కిందట భారత ప్రధాని నరేంద్ర మోదీ లండన్‌ పర్యటన సందర్భంగా బ్రిటన్‌ ప్రధాని థెరిసా మేతో ఈ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సాంకేతిక సహకారం–వాణిజ్య విస్తరణతో ఉభయ దేశాల పరస్పర ప్రయోజనం ఇందులో ప్రాధాన్యతాంశమని అశ్క్విత్‌ పేర్కొన్నారు. నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఆధునిక రవాణా వ్యవస్థల ఏర్పాటుకు అవసరమైన నైపుణ్యాల్ని భారత్‌లో విస్తరించడానికి ఇప్పటికే బ్రిటన్‌ వ్యాపార–వాణిజ్య సంస్థలు సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తాము కాల్‌టెక్‌ హబ్స్‌ ఏర్పాటు చేయడం ద్వారా, ఇక్కడ వినూత్న తరహాలో వచ్చిన అంకుర సంస్థల(స్టార్టప్స్‌)తో భాగస్వామ్యాలకు బ్రిటన్‌ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని పేర్కొన్నారు. దక్షిణాదిలో హైదరాబాద్‌ మరింత ప్రయోజనకారి కాగలదని అంచనా వేశారు. బ్రిటన్‌ నైపుణ్యాల్ని, సాంకేతిక సహకారాన్ని గరిష్టంగా వినియోగించుకునేలా ఇక్కడి  స్టారప్స్‌తో అనుసంధానించే నైపుణ్య మానవ వనరుల్ని సమకూర్చడం ద్వారా తెలంగాణ ‘టీ–హబ్‌’కీలక పాత్రదారి కానుందని అభిప్రాయపడ్డారు. చమురు కోసం సముద్ర గర్భాన్ని తొలిచే సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో బ్రిటన్‌ కంపెనీలు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో చమురు–సహజవాయు రంగంలో పనిచేస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

విద్య, ఉద్యోగ రంగాల్లోనూ పెరగనున్న వీసాలు
ఐరోపా సంఘం (ఈయూ) నుంచి బ్రిటన్‌ వైదొలగుతున్న నేపథ్యంలో కొత్త వలసల విధానం రూపుదిద్దుకుంటోందని అశ్క్విత్‌ తెలిపారు. దాంతో భాగస్వామ్య వృద్ధిలో, విద్య–ఉద్యోగావకాశాల్లో భారత్‌ వంటి దేశాలకు మున్ముందు చక్కని అవకాశాలుం టాయని అన్నారు. ఐటీ, వైద్య రంగంలో భారత్‌ దృఢంగా ఉందని వ్యాఖ్యానించారు. భారత్‌ నుంచి యూకేలో ఉన్నత విద్యకు వెళ్లే వారిప్పుడు 37 శాతం పెరిగారని చెప్పారు. గత సంవత్సరం ఈ వృద్ధి రేటు 17 శాతంగా ఉందన్నారు. ప్రతి 10 మందిలో 9 మంది విద్యార్థులకు వీసాలు లభించే పరిస్థితి ఉందన్నారు. యూకే విశ్వవిద్యాలయాల సామర్థ్యాన్ని భారత విద్యార్థులు గరిష్టంగా వినియోగించుకోవాలన్నదే తమ కోరికని, పెరుగుతున్న సంఖ్యే దానికి నిదర్శనమన్నారు. వాణిజ్య, విద్య, ఉద్యోగ వీసాల్లో వృద్ధి వల్ల బ్రిటన్‌ సందర్శించే భారతీయుల సంఖ్య పెరుగుతుందని, ఇది పరస్పర వాణిజ్య, సాంస్కృతిక సంబంధాల్ని మెరుగుపరుస్తుందని అన్నారు. రానున్న క్రికెట్‌ ప్రపంచకప్‌ సందర్భంగా కూడా బ్రిటన్‌కు భారతీయ సందర్శకులు పెరుగుతారని అభిప్రాయపడ్డారు. 2018లో భారత్‌కు చెందిన నైపుణ్యం గల ఉద్యోగులు, సిబ్బందికి 55,000 బ్రిటన్‌ వీసాలు లభించాయని, మిగతా అన్ని దేశాలకు కలిపి దాదాపు ఇన్నే లభించాయని గుర్తు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement