విభజనకు నిరసనగా లండన్ లో యూకే వైఎస్సార్సీపీ ధర్నా!
రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే విభాగం లండన్ లోని ఇండియన్ హైకమిషన్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇటీవల నిర్వహించిన కార్యక్రమానికి యూకేలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు.
ప్రముఖ చానెల్లు నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే విభాగం అధ్యక్షులు శ్రీకాంత్ లింగాల, యునైటెడ్ ఆంధ్రా యూనియన్ కోఆర్డినేటర్లు వైఎల్ఎన్ రెడ్డి, సతీష్ లు, ఇతర నాయకులు భూపతి రాజు సీతారామా రాజు, విజయ్ రావూరి, రవి కిరణ్ చింత, జనార్ధన్ రెడ్డిలతోపాటు దీపక్ అగర్వాల్, లండన్, సౌత్ ఈస్ట్, మిడ్ ల్యాండ్ కు చెందిన కార్యకర్తలు పాల్గొన్నారు.
చర్చ కార్యక్రమంలో శ్రీకాంత్ లింగాల మాట్లాడుతూ.. సమస్యలకు ఎలాంటి పరిష్కారం చూపకుండా.. కేవలం రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలనే లక్ష్యంతో ఏకపక్షంగా రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పట్టారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గత 70 రోజులుగా రోడ్లపైకి వచ్చిన సీమాంధ్ర ప్రజలను కేంద్ర పట్టించుకోకపోవడం శోచనీయం అని శ్రీకాంత్ అన్నారు.
అసెంబ్లీలో ఎలాంటి తీర్మానం లేకుండా రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకోవడం కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం అని వైఎల్ఎన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం భవిష్యత్ వర్గాలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. ఎన్నికల్లో లబ్ది పొందడానికే రాష్ట్రాన్ని విభజించడం అనేక సమస్యలకు దారి తీస్తుంది అని జనార్ధన్ రెడ్డి, శ్యామ్, దీపక్ అగర్వాల్ అన్నారు.
యూరప్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కోర్ కమిటి సభ్యులు భూపతి రాజు సీతారామరాజు, వైఎల్ఎన్ రెడ్డి, శ్రీకాంత్ లింగాల, రవి కిరణ్ చింత, జనార్ధన్ చింతపాటి, విజయ్ రావూరి, జయభారత్, కౌశిక్ సుంకర, శివారెడ్డి లెవక, శ్రీకాంత్ అల్లాడు, సుదర్శన్, రఘు, రెడ్డి వేముల, ప్రవీణ్ రాజు, హరీష్ వెంపర్ల, ప్రసాద్ రెడ్డిలు ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలకపాత్రను పోషించారు.